తుంగతుర్తి గురించి మాట్లాడే హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్ కు లేదు..ముందు మునుగోడు సంగతి చూసుకో

తుంగతుర్తి గురించి మాట్లాడే హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్ కు లేదు..ముందు మునుగోడు సంగతి చూసుకో
  • నా హక్కులను హరిస్తే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తా  : ఎమ్మెల్యే మందుల సామేల్

 సూర్యాపేట, వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలపై మాట్లాడే హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్ కు లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గం గురించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 'మునుగోడు ఎమ్మెల్యేకు నా నియోజకవర్గంతో ఏం సంబంధం, ముందు నీ మునుగోడు సమస్యలు, నీ మునుగోడు మురికిని చూసుకో, నీతో పాటు వచ్చిన నాయకులకే పదవులు ఇప్పించలేకపోయావు' అని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రొటోకాల్‌‌ ఉల్లంఘించారని, దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అలాంటి వ్యక్తికి తన నియోజకవర్గంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దళిత నియోజకవర్గాలపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం తనకు టికెట్ వచ్చిందని, ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను భయపడేది తుంగతుర్తి ప్రజలకు, ఓటర్లకు మాత్రమేనని, ఎవరిముందూ చేతులు చాచే అవసరం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బడుగు, బలహీన వర్గాల ప్రజలే అండగా ఉంటున్నారన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌‌లోకి వచ్చిన కొందరు పార్టీని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియమించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులే కొనసాగుతారని, వారి నియామకాలపై ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఎస్టీ, యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవులు కేటాయించాలని సీఎంను కోరారు. సమావేశంలో తిరుమలగిరి మండల అధ్యక్షుడు సుంకరీ జనార్దన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.