
వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలు జరుగుతున్నట్టు తేలింది . మంగళవారం ఈవో వెంకటేశ్, పాలక మండలి చైర్మన్ సేవల్ల సంపత్ స్టాక్ రూమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్ మాట్లాడుతూ… లడ్డూ తయారీలో అవకతవకలు జరగుతున్న విషయం తమ దృష్టికి రావడంతో నిఘా వేసినట్టు చెప్పారు . అందు లో భాగంగానే ప్రసాదాల తయారీతో పాటు రికార్డులను కూడా పరిశీలించి నట్టు తెలిపారు. ప్రసాదం తయారీలో ఉపయోగించే రూ. ఐదు లక్షల విలువైన నెయ్యి , ఖాజు, బాదామ్ , పిస్తా లను భయటకు తరలించినట్టు గుర్తించామని చెప్పారు. రికార్డుల పరిశీలనలో భారీ ఎత్తున తేడాలు రావడంతో పూర్తి స్థాయిలో విచారించడంతో అసలు విషయం భయటపడిందని అన్నారు . ఆలయ ఏఈవో సుదర్శన్‌తోపాటు ఉద్యోగులు మాధవి, పోచయ్యలకు మెమోలు జారీ చేసినట్టు చెప్పారు. మూడు రోజుల్లో ఈ విషయంపై ఆ ముగ్గురు సమాధానం ఇవ్వకుంటే దేవాదాయ ధర్మధాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.