గోవాలో విద్య, వైద్యం బాగున్నయ్ : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

గోవాలో విద్య, వైద్యం బాగున్నయ్ : కొండా విశ్వేశ్వర్​రెడ్డి
  • అక్కడికి బీజేపీ కార్యకర్తల్ని తీసుకెళ్తా 
  • ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి

చేవెళ్ల, వెలుగు : గోవా రాష్ట్రంలో  విద్య, వైద్యం అమలు తీరును పరిశీలించేందుకు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్కడికి తీసుకెళ్తానని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్​రెడ్డి తెలిపారు.  శనివారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌‌లో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన కొండా విశ్వేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ.. గోవాలోని ఏదైనా గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ జరిగిన అభివృద్ధి చూసేందుకు ఈ టూర్ ఉంటుందన్నారు.  

గోవాలోని బీజేపీ సర్కార్ నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు ఇతర కార్యక్రమాలను గొప్పగా అమలు చేస్తున్నారన్నారు. గోవాలోని గ్రామాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాండురంగారెడ్డి, అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు చాకలి శ్రీనివాస్, వివిధ గ్రామాల బీజేపీ నేతలు పాల్గొన్నారు.