సుప్రీం ఆదేశాలతో ఎల్గార్ పరిషత్​ కేసు నిందితుడు విడుదల

సుప్రీం ఆదేశాలతో ఎల్గార్ పరిషత్​ కేసు నిందితుడు విడుదల

ఎల్గార్ పరిషత్​ కేసులో అరెస్టైన గౌతం నవలఖా ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 2020 ఏప్రిల్ నుంచి ముంబైలోని తలోజా జైల్లో ఉన్న నవలఖాను సుప్రీం ఆదేశాల మేరకు గృహ నిర్భంధానికి తరలించారు. అతని వైద్య అవసరాల రీత్యా జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించాలని గతంలో సుప్రీంకోర్టు ఎన్‌ఐఏను ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను ఎన్‌ఐఏ అమలు చేయలేదు. దీనిపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది.

నవలఖాకు మావోయిస్టులతో, పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయంటూ.. ఎన్ఐఏ చేసిన ఆందోళనలకు కోర్టు రద్దు చేసింది. నవలఖా కొన్ని కీలకమైన ఆధారాలను దాచిపెడుతున్నారని ఎన్ఐఏ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ఆయన్ను విడుదల చేయలేదని చెప్పారు. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయకుండా లోపాలను వెతుకుతూపోతే.. తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. 24 గంటల్లోగా నవంబరు 10న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని చెప్పింది. దీంతో ఎన్‌ఐఏ ఆయన్ను గృహనిర్బంధానికి తరలించింది.

అయితే సుప్రీం కొన్ని షరతులు విధించింది. ఇంటి వద్ద నియమించిన పోలీస్ సిబ్బంది ఖర్చులను నవలఖానే భరించుకోవాలని చెప్పింది. దీనికోసం ముందుగానే రూ.2లక్షల 40వేలు చెల్లించాలని సూచించింది. మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌, ల్యాప్‌టాప్‌, ఇతర ఏ కమ్యూనికేషన్‌ పరికరాలను వాడటానికి అనుమతి లేదని.. సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కానీ, రోజులో ఒకసారి మాత్రం పోలీస్‌ సిబ్బంది సమక్షంలో.. మొబైల్‌ ఫోన్‌ను 10 నిమిషాలు మాట్లాడేందుకు నవలఖాకు అవకాశం కల్పించింది. నవ్‌లఖా.. నవీ ముంబయిని వీడి వెళ్లరాదని షరతు పెట్టింది. వారంలో ఒకసారి మాత్రం తన కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను రెండు, మూడు గంటల సమయం పాటు కలిసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.