- శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నం
- హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు వెల్లడి
జూబ్లీహిల్స్, వెలుగు: వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే కృష్ణానగర్ ప్రాంతానికి ఈసారి శాశ్వత ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణానగర్‌లో కొనసాగుతున్న నాలా అభివృద్ధి, పూడికతీత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. రంగనాథ్ మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి భారీగా వచ్చే వరద నీటితో పాటు మట్టి చేరి కాలువల్లో పూడిక పేరుకుపోయిందని తెలిపారు. దీంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లలేక రహదారులపైకి చేరుతోందన్నారు. ప్రస్తుతం కాలువల్లో 6 నుంచి 7 అడుగుల మేర పూడిక ఉందని, 8 నుంచి 9 అడుగుల లోతులో ఉన్న కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసేందుకు అవసరమైన చోట్ల స్లాబ్‌లను కూడా తొలగించనున్నట్లు వెల్లడించారు.
వరద కాలువ నిర్మాణం!
కృష్ణానగర్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రత్యామ్నాయ వరద కాలువ నిర్మాణంపై కూడా చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూడటమే లక్ష్యమన్నారు.
