- 14న మీటింగ్ పెట్టాలన్న తెలంగాణ విన్నపాన్ని బుట్ట దాఖలు చేసిన కృష్ణ బోర్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మరోసారి తన పక్షపాత వైఖరిని ప్రదర్శించింది. త్రీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహణ విషయంలో తెలంగాణ విన్నపాన్ని కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తేదీనే ఖరారు చేసింది. ఏపీ అడగడమే ఆలస్యంగా ఈ నెల 12నే త్రీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ బోర్డు శుక్రవారం రెండు రాష్ట్రాలకు లేఖలు రాసేసింది. తమ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు కావాలని ఏపీ.. సాగర్ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కావాలని తెలంగాణ ఇటీవల బోర్డుకు లేఖలు రాశాయి.
ఈ నేపథ్యంలో సమావేశం నిర్వహణకు అనువైన తేదీని చెప్పాలని బోర్డు కోరగా.. ఈ నెల 14న ఎలాగూ 21వ బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఉన్నందున, అందులోనే ఈ అంశాన్ని చర్చిద్దామని తెలంగాణ ప్రతిపాదించింది. అయితే, ఏపీ మాత్రం ఈ నెల 12నే సమావేశం కావాలని కోరగా, బోర్డు వెంటనే ఏపీ ప్రతిపాదనకే పచ్చజెండా ఊపింది.
ఏపీకి వంత పాడుతున్న బోర్డు
వాస్తవానికి గతేడాది డిసెంబర్ నుంచే త్రీ మెంబర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. తొలుత జనవరిలో నిర్వహిస్తామని చెప్పిన బోర్డు, ఏపీ అభ్యంతరాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. అప్పట్లో మీటింగ్ పెట్టకుండా ఆలస్యం చేసిన బోర్డు.. ఇప్పుడు నీళ్ల కోసం ఏపీ కోరగానే వారు చెప్పిన తేదీకే సమావేశం ఖరారు చేసింది. మరో 15 రోజుల్లో ప్రస్తుత సీజన్ పూర్తికానున్న తరుణంలో ఇప్పుడు అత్యవసరంగా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైనప్పుడు మీటింగ్ పెట్టకుండా, ఏపీకి సహకరించేందుకే బోర్డు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
