- ఉచితంగా ఇవ్వాలని స్థానికుల డిమాండ్
- పేరుకుపోయిన లక్షల టన్నుల బూడిదతో ముప్పు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) నుంచి వెలువడే బూడిద కుప్పలుగా పేరుకుపోతుంది. రోజువారీగా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తుండడంతో యార్డ్ అంతా బూడిదతో నిండిపోయింది. కేటీపీపీ బూడిద టెండర్ గడువు మార్చి 31తో ముగిసింది. కొత్త టెండర్ ఖరారు కాకపోవడంతో ఈ నెల 30 వరకు పాత టెండర్ గడవు పొడిగించారు. పేరుకుపోతున్న బూడిదతో వాతావరణం కలుషితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటీపీపీ పరిసరాల గ్రామాల ప్రజలు తమకు బూడిద ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఎక్కువ ధరకు టెండర్ ద్వారా అమ్ముతుండడంతో కొనుగోళ్లు, రవాణా భారమై వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో లక్షల టన్నుల బూడిద నిల్వలు పేరుకుపోతున్నాయి.
స్థానికులకు ఊపిరాడ్తలేదు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ వద్ద ఉన్న 1,100 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి కేంద్రం ద్వారా వెలువడుతున్న బూడిదతో స్థానికులకు ఊపిరాడ్తలేదు. రెండు ప్లాంట్ల ద్వారా వెలువడే బూడిదను కేటీపీపీ అవసరం ఉన్న వారికి టెండర్ల ద్వారా అమ్ముతుంది. కేటీపీపీ నిర్మాణంతో దుబ్బపల్లి, చెల్పూర్ గ్రామాలకు చెందిన 100 మంది బూడిద సప్లై చేసే బల్కర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. డిమాండ్ పెరిగిందనే కారణంతో ప్రతి ఏటా బూడిద టెండర్ రేట్ పెరుగుతుండడంతో నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో కేటీపీపీ నుంచి టన్నుకు రూ.347తో బూడిద కొనుగోలు చేసేందుకు సాగర్, మహా, దక్కన్, ఐసీఎల్ సిమెంట్ కంపెనీలు, కేఏస్సీ ట్రాన్స్ పోర్టు, సుధాకర్ రావు, ఎస్ఎస్జీ అగ్రిమెంట్ చేసుకున్నాయి. కొనుగోలు, రవాణా ఖర్చు ఎక్కువగా ఉండడం, బయటి మార్కెట్ లో బూడిద అగ్గువకు వస్తుండడంతో గిట్టుబాటు కాక వారు బూడిదను తరలించేందుకు ముందుకు రావడం లేదు.
దీంతో కేటీపీపీ రోజుకు 2 వేల టన్నుల బూడిదను డంపింగ్ యార్డుకు తరలిస్తుండడంతో డంపింగ్ యార్డు నిండిపోయింది. సైలోల నుంచి వెలువడుతున్న బూడిద దుబ్బపల్లితో పాటు పంట పొలాలను కమ్మేయడంతో పాటు మోరంచ కాలుష్యమయంగా మారిపోయింది. బూడిదను ఎప్పటికప్పుడు పంపించకుంటే డంపింగ్ యార్డు పూర్తిగా నిండిపోతుందని అంటున్నారు. ఇప్పటికే 5 లక్షల టన్నుల వరకు బూడిద నిల్వలు పేరుకుపోయాయి.
బూడిదతో ఉపయోగాలు..
సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్ బ్లాక్స్, టైల్స్, ఫైబర్, సిమెంట్ రేకులు, పైపులు, బోర్డులు, ప్యానెళ్ల వంటి పరిశ్రమల్లో బూడిదను విరివిగా వాడుతున్నారు. అంతేకాకుండా రోడ్ల నిర్మాణాలకు, తవ్విన బొగ్గు గనులను నింపడానికి బూడిదను వినియోగిస్తున్నారు.
కేంద్రం చెబుతున్నా తీరుమారట్లే..
కేటీపీపీ ప్రభావిత గ్రామాలను కాలుష్య కోరల్లో నుంచి కాపాడేందుకు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిదను ఎప్పటికప్పుడు బయటకు తరలించాలని కేంద్రం పదేపదే చెబుతున్నా నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు థర్మల్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను పూర్తిగా ఎప్పటికప్పుడు బయటికి పంపాలి.
నిల్వ చేయకూడదు. థర్మల్ ప్లాంట్ ప్రాంతంలో కాలుష్యం లేకుండా చూడాలి. థర్మల్ కేంద్రానికి 100 కిలోమీటర్ల పరిధిలోని చిన్న పరిశ్రమలకు బూడిదను టన్ను రూపాయి ధరతో ఇచ్చేందుకు టెండర్లు పిలవాలి.అవసరమైతే జెన్కోనే రవాణా ఖర్చులు భరించి ప్లాంటు పరిధిలో బూడిద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా ఇక్కడ అమలు కావడం లేదు. నిల్వలు పేరుకుపోతే థర్మల్ ప్లాంట్లకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించినా బేఖాతర్ చేస్తున్నారు.

