3,300 ఎకరాలపై రేవంత్ కన్ను..మూసీ ప్రక్షాళన పేరిట రూ.లక్షన్నర కోట్ల స్కామ్: కేటీఆర్

3,300 ఎకరాలపై రేవంత్ కన్ను..మూసీ ప్రక్షాళన పేరిట రూ.లక్షన్నర కోట్ల స్కామ్: కేటీఆర్
  •     బీఆర్ఎస్​ హయాంలో రూ.16 వేల కోట్లతోనే మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు
  •     ఒక్క ఇల్లు కూల్చకుండా ప్లాన్​ రెడీ చేసినం
  •     రేవంత్​ సర్కార్​ మాత్రం కూల్చివేతలతో విధ్వంసం సృష్టిస్తున్నది
  •     మూసీని ఖరాబ్​ చేసిందే  కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాలు
  •     అందుకు రేవంత్​ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ 
  •     ప్రభుత్వ పవర్ ​పాయింట్​ ప్రజంటేషన్‌‌‌‌కు కౌంటర్‌‌‌‌‌‌‌‌గా కేటీఆర్​ పీపీటీ


హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్​ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా రూ.16 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేశామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తెలిపారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్​ ప్రాంతాల్లో 6  కిలో మీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. కానీ, ప్రస్తుత రేవంత్​ సర్కారు మాత్రం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇండ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. ఎలాంటి డీటెయిల్స్​, ప్లానింగ్​ రిపోర్టు లేకుండా, సోషల్​ ఇంపాక్ట్​, ఎన్విరాన్మెంటల్​ ఇంపాక్ట్​ స్టడీలు చేయకుండా, ప్రజలతో చర్చించకుండా వేలాది ఇండ్లను కూలగొడతామంటూ ప్రజలను రేవంత్​ భయపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ ప్రభుత్వం భూసేకరణ చట్టాలు, ఇతర నిబంధనలన్నింటినీ పాతర వేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని అన్నారు. అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని, కాంగ్రెస్​ పార్టీ భూదాహానికి, రేవంత్‌‌రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకే వ్యతిరేకమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన పవర్​పాయింట్​ ప్రజెంటేషన్‌‌కు కౌంటర్‌‌‌‌గా.. శనివారం కేటీఆర్‌‌‌‌ కూడా హిమాయత్​సాగర్‌‌‌‌లో పీపీటీ​ ఇచ్చారు. రేవంత్​ అవినీతిని కచ్చితంగా అడ్డుకుంటామని, పార్టీలకతీతంగా హైదరాబాద్​ ప్రజలను కాపాడుకుంటామని చెప్పారు. రెండేండ్లు మూసీ బాధితులు సమిష్టిగా ప్రభుత్వంపై పోరాడితే.. కాంగ్రెస్​ పార్టీ బుల్డోజర్​ రాజ్యాన్ని పారదోలి అందరి ఇండ్లనూ కాపాడుతామని చెప్పారు. మూసీ పక్కన ఉన్న 3,300 ఎకరాల భూమిపై రేవంత్‌‌రెడ్డి కన్నేశారని, అందుకే మూసీ ప్రక్షాళన పేరిట రూ.లక్షన్నర కోట్ల స్కామ్‌‌కు తెరదీశారని, రియల్​ ఎస్టేట్​ ఆధారిత మూసీని రూపొందిస్తున్నారని ఆరోపించారు. 

మూసీని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్..

మూసీని ప్రక్షాళన చేస్తామని పదే పదే కాంగ్రెస్​ ప్రభుత్వం చెబుతున్నదని, అసలు మూసీని ఖరాబ్​ చేసిందే కాంగ్రెస్​ పార్టీ అని కేటీఆర్​ మండిపడ్డారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను నాశనం చేసిందన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనం అయిందని విమర్శించారు. ‘‘గతంలో మూసీని మురికి కూపంగా మార్చిన పాపానికి ప్రజలకు రేవంత్‌‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. వందల కిలోమీటర్ల మేర చేసే నమామి గంగ ప్రాజెక్ట్​కు రూ.42 వేల కోట్లు ఖర్చయితే.. 55 కిలోమీటర్ల దూరానికే మూసీకి కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చుపెడుతున్నదో చెప్పాలి. రేవంత్‌‌రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా.. మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తే తప్పేంటని రేవంత్​ రెడ్డి స్వయంగా చెప్పిండు. గాంధీ విగ్రహం పెడతా అంటున్న ఆయన.. గాంధీ పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని గాంధీ మునిమనుమడు తుషార్​ గాంధీ విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. మేం మూసీలో ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా నాగోల్‌‌లో అభివృద్ధి చేశాం. దీంతోపాటు బేగంపేట, గండిపేటలాంటి అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేశాం. కాంగ్రెస్‌‌లాగా ప్రచారం చేసుకోలేకపోయినం’’ అని పేర్కొన్నారు. 

ఇంటర్నేషనల్ ​డిజైన్​ కాంపిటీషన్​ పెట్టినం

పేదల ఇండ్లను కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్​ హయాంలో ఇంటర్నేషనల్​ డిజైన్స్​ కాంపిటీషన్​ పెట్టామని కేటీఆర్​ గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్​ ప్రభు త్వం బఫర్​జోన్​ పేరు చెప్పి ప్రజలను భయపె ట్టి ఇండ్లను కూలుస్తున్నదని ఆరోపించారు. ‘‘కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్‌‌ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్‌‌లో ఉన్నది కదా? దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. రేవంత్​ సోదరుడి ఇల్లు, మంత్రుల ఫాంహౌస్​లు, ఇండ్లు బఫర్​ జోన్​లోనే ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 20 ఏండ్ల కింద కట్టుకున్న అపార్ట్‌‌మెంట్లు, ఇండ్ల ను కూలగొడతానని చెబుతున్న రేవంత్‌‌ రెడ్డి.. ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌‌లో కడుతు న్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌‌మెంట్లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నారు. ఇప్పుడు బఫర్ జోన్​లో ఉన్న వాటిని కూల్చేసి తిరిగి అదే బఫర్ జోన్లలో భారీ భవనాలు కడతా అంటున్నారు. మూసీ బాధితుల ఇండ్లకు జీరో విలువ అని చెబుతున్న రేవంత్​ రెడ్డికే జీరో వాల్యూ’’ అని ఎద్దేవా చేశారు.