
నల్గొండలో జరిగిన టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థిని కాకుండా కేసీఆర్ ను చూసి ఎన్నికల్లో ఓటేయాలన్నారు. భారీ మెజార్టీ లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. సభలో మాట్లాడిన ఆయన.. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చని చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో మరోసారి కష్టపడితే అన్ని పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించవచ్చన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా ఉందన్నారు. ఇక్కడి పథకాలను కేంద్రం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు కేటీఆర్.
దేశంలో మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతందున్నారు కేటీఆర్. యూపీఏ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఎన్డీఏ, యూపీఏ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్నారు. ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. టీడీపీ తట్టాబుట్టా సర్దుకుని అమరావతి పారిపోయిందన్నారు కేటీఆర్. నలగొండ పార్లమెంటులో నియోజకవర్గంలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రెండు వైద్య కళాశాలు తీసుకొచ్చామన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.