అప్పుల కంటే ఆస్తులే ఎక్కువున్నాయ్ : కేటీఆర్

అప్పుల కంటే ఆస్తులే ఎక్కువున్నాయ్ : కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. శనివారం (డిసెంబర్ 16న) శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ పేరును స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే డా. గడ్డం వివేక్‌ వెంకటస్వామి బలపరిచారు. 

ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్నీ అప్పులే ఉన్నాయని అధికార పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అప్పుల కంటే ఆస్తులే ఎక్కువు ఉన్నాయని చెప్పారు. విద్యుత్ శాఖలో 81 వేల 516 కోట్ల అప్పు చేశారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారని, అయితే.. ఆస్తుల గురించి చెప్పడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా తమను బద్నాం చేయడానికి అప్పుల సాకు చెప్పి.. ఆరు గ్యారెంటీలు ఎగ్గొటేందుకు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించి వెళ్లే సమయంలో టీఎస్ ట్రాన్స్ కో సంస్థ 2 వేల700  మెగావాట్ల లోటు, 22 వేల 423 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ఒక లక్షా 37 వేల 571 కోట్లు విద్యుత్ శాఖలో ఆస్తులు సమకూర్చి పెట్టామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని కోరారు. విద్యుత్ సంస్థలను నడపడంలో ఒక చాలెంజ్ గా తీసుకున్నామని చెప్పారు.