ఐటీ, ఈడీ దాడులతో సోనూసూద్‌‌ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం

ఐటీ, ఈడీ దాడులతో  సోనూసూద్‌‌ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా కష్టకాలంలో అద్భుతంగా సేవలందించిన సినీ నటుడు సోనూసూద్‌‌ రాజకీయాల్లోకి వస్తారనే ఆయనపై ఐటీ, ఈడీ దాడులు చేశారని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. ఐటీ, ఈడీ దాడులతో ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. రియల్‌‌ హీరో సోనూసూద్‌‌ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మానవత్వానికి కరోనా చాలెంజ్‌‌ విసిరిన టైమ్​లో ఆయన ఎంతో మందికి సేవ చేశారని పొగిడారు. సోమవారం హెచ్‌‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌‌ ఇంపాక్ట్‌‌ గ్రూప్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కొవిడ్‌‌ -19 వారియర్స్‌‌ రికగ్నైజేషన్‌‌ ఈవెంట్‌‌’లో కేటీఆర్​ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై సోషల్‌‌ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులభమని.. పని చేయడమే కష్టమన్నారు. కేటీఆర్‌‌ లాంటి నాయకులుంటే తన లాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదని సోనూసూద్‌‌ చెప్పారు. కరోనాతో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయారని, వారికి సాయపడటమే తనముందున్న సవాల్‌‌ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌‌ నుంచి కన్యాకుమారి వరకు సహాయ కార్యక్రమాలు చేశానని, ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా స్పందించే వ్యవస్థ కనిపించిందని, అది కేటీఆర్‌‌ ఆఫీస్‌‌ అని పొగిడారు.

ఐఐటీ స్టూడెంట్​కు ఫీజు కడ్త: మంత్రి హామీ

ఐఐటీ వారణాసిలో సీటు సంపాదించిన నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన స్టూడెంట్‌కు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెంకు చెందిన శ్రీలత నాగర్‌‌ కర్నూల్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌‌  రెసిడెన్షియల్‌ జూనియర్‌‌ కాలేజీలో చదివింది. -జేఈఈలో ర్యాంకు సాధించి ఐఐటీ వారణాసిలో సీటు సంపాదించింది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా కాగా, కాలేజీ ఫీజులు చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న శ్రీలత పరిస్థితి మంత్రి కేటీఆర్‌‌ కి తెలిసింది.  ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి  శ్రీలత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన సొంత డబ్బులతో శ్రీలతను చదివిస్తానని, చదువు పూర్తయ్యే వరకు ఆమె బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలతను కేటీఆర్‌‌ అభినందించారు. అనంతరం ఐఐటీకి అవసరమైన డబ్బులను అందజేశారు.