రేవంత్‌.. బీజేపీకి ఎందుకు భయపడుతున్నవ్‌?: కేటీఆర్‌‌

రేవంత్‌.. బీజేపీకి ఎందుకు భయపడుతున్నవ్‌?: కేటీఆర్‌‌

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సీఎం రేవంత్‌ రెడ్డికి భయమెందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ఏమీ ఇవ్వకపోయిన సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని శనివారం ‘ఎక్స్‌’లో నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులను అన్యాయంగా కేఆర్ఎంబీకి అప్పగించడంపై కూడా ఆయన స్పందించడం లేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ఇప్పుడున్న 40 స్థానాలు కూడా నిలబెట్టుకునే అవకాశం లేదన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ వైఖరి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోందని, దీనిపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతోందని, దీంతో బీజేపీకే లాభం చేకూరుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఆపగలిగేది మమతా బెనర్జీ, అర్వింద్​కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులే తప్ప.. కాంగ్రెస్ పార్టీ కాదని పేర్కొన్నారు.