స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం..దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్

స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం..దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్

ఫిరాయింపులపై దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్​
ఆయనకు, ఆయన్ను నడిపించిన కాంగ్రెస్​ నేతలకు సన్మానం చేస్తం
రాహుల్ ఒత్తిడితోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ 
ఈ తీర్పుతో దేశంలోనే రాహుల్ పెద్ద జోకర్​గా మారిండు
ఇలాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపులపై స్పీకర్​ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికమని, దారుణమని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మండిపడ్డారు. రాహుల్​ గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే కడియం శ్రీహరి, దానం నాగేందర్​కు స్పీకర్​ ప్రసాద్​ కుమార్ క్లీన్​చిట్​ఇచ్చారన్నారు. స్పీకర్​పై రాహుల్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, రాహుల్ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ చేతుల్లో ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై కాంగ్రెస్​ పార్టీ దాడి చేస్తున్నదని, దీని వెనక ప్రధాన నేరస్తుడు రాహుల్  అని అన్నారు. స్పీకర్​ తీర్పు కాపీ ఇంకా రాలేదని, అది అందాక తీర్పును హైకోర్టులో సవాల్​ చేస్తామని తెలిపారు. ఫిరాయింపులపై స్పీకర్​ ఇచ్చిన తీర్పుపై బుధవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఆయన్ను చప్పట్లు, శాలువాలతో నిజాం కాలేజీ గ్రౌండ్స్​లో సన్మానం చేస్తామని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ బీఫారం వాడారు.. ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏ పార్టీ తరఫున బీఫాం పొందారన్న విషయం స్పష్టంగా ఉందని, అయినా కూడా అనర్హత పిటిషన్​ను తిరస్కరించారంటే స్పీకర్​ను, ఆయన్ను నడిపిస్తున్న కాంగ్రెస్​ నేతలను సత్కరించాల్సిందేనని చెప్పారు. 

రాహుల్ ​ఓ జోకర్​

రాహుల్​ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని దానికి రక్షకుడినని చెప్పుకుంటున్నారని, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై ఆయనే సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. ఆ తీర్పుతో రాహుల్ గాంధీ దేశంలోనే పెద్ద జోకర్​గా నిలిచిపోయారన్నారు. ఇలాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ‘‘పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్​క్వాలిఫికేషన్ అని చెప్పిన రాహుల్.. తెలంగాణ వచ్చి న్యాయ పత్రాల గురించి ఉపన్యాసాలు దంచిన రాహుల్.. ఈ రోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం సమాధానం చెప్తరు? ఫిరాయింపులపై అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా కూడా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది? చేసేవి అనైతిక కార్యక్రమాలు, చెప్పేవి నీతులు అన్న తీరుగా రాహుల్ తీరు ఉంది’’ అని పేర్కొన్నారు. 

ఫిరాయింపులు తెచ్చిందే కాంగ్రెస్​ 

ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీకి లేదని కేటీఆర్​ మండిపడ్డారు. రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందన్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్​ఎస్​ 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది ఈ థర్డ్​ క్లాస్​ కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. ఆయారాం గయారాం కల్చర్​ తెచ్చింది ఈ కాంగ్రెస్​ పార్టీనేనన్నారు. ఫిరాయింపుల అంశంపై దానం నాగేందర్, కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుందన్నారు.