ఎల్‌నినో పేరుతో రైతులను ఆగం చేస్తున్నరు: కేటీఆర్

 ఎల్‌నినో పేరుతో రైతులను ఆగం చేస్తున్నరు: కేటీఆర్
  • జూరాల చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలి: కేటీఆర్

వనపర్తి/పెబ్బేరు, వెలుగు: ఎల్‌నినో పేరుతో పాలమూరు రైతులను సీఎం రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని, జూరాల ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరిచ్చేదాకా కొట్లాడతామని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డిని పరామర్శించిన అనంతరం పెబ్బేరులో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నీటిని అత్యల్పంగా వాడుకుంటున్నది రేవంత్​ప్రభుత్వమేనని, కేసీఆర్ హయాంలో ప్రతి సంవత్సరం 30 శాతానికి పైగానే వాడుకున్నామని గుర్తు చేశారు.

ప్రభుత్వ తీరు వల్ల జూరాల, కేఎల్ఐ ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్​పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నవాటిని పూర్తి చేసి పరుగులు పెట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాంగ్రెస్​ప్రభుత్వం కాకిగోల చేసిందని, కానీ కర్నాటకలో ఆల్మట్టిని 5 మీటర్ల ఎత్తు పెంచేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. జూరాల, కేఎల్ఐని ఆన్ చేయాలని, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి పోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేఎల్ఐ పంప్ లను నిరంతరం నడపాలని, కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆపేస్తే అవి చెడిపోతాయన్నారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి సాగుకు నీటిని ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, తన గురువు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకు వారికి 100 టీఎంసీల నీళ్లు ఇచ్చారని విమర్శించారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లెల్లో రైతులు కరెంటు లేక రోడ్డు ఎక్కితే.. ఎల్ నినో పేరు చెప్పి రైతులను అవస్థలు పెడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు గుమ్మడం, పెబ్బేరు సబ్​స్టేషన్లు, జూరాల కాల్వను పరిశీలించారు.