వాడిని వేసేస్తే మనమే పెద్ద రౌడీలం..పాపులర్ అయ్యేందుకే రౌడీషీటర్ను హత్య చేసిన అనుచరులు

వాడిని వేసేస్తే మనమే పెద్ద రౌడీలం..పాపులర్ అయ్యేందుకే రౌడీషీటర్ను హత్య చేసిన అనుచరులు
  • మామూళ్లు మొత్తం మనకే వస్తయ్

కూకట్​పల్లి, వెలుగు: ‘అతడో వీధి రౌడీ.. అతడు అడిగితే కిమ్మనకుండా మామూళ్లు ఇస్తారు.. వారి కళ్లముందే ఎన్నో సెటిల్​మెంట్లు చేశాడు.. అతడిని చంపేస్తే మనకే ఆ స్థానం వస్తుంది కదా.. బాగా పాపులర్​ రౌడీలం కూడా కావచ్చు’.. ఇలా ఆలోచించిన ముగ్గురు యువకులు ఓ రౌడీషీటర్​ను హత్య చేశారు. అనుచరులుగా ఉంటూనే నమ్మించి పథకం ప్రకారం మర్డర్​ చేశారు. మూడు రోజుల క్రితం కూకట్​పల్లిలో జరిగిన మర్డర్​ కేసు కథ ఇదీ. ఈ కేసును పోలీసులు చేధించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. బుధవారం కూకట్​పల్లి పోలీసుస్టేషన్​లో బాలానగర్ జోన్​ డీసీపీ కె.సురేశ్​కుమార్​ వివరాలు వెల్లడించారు.

బోరబండ పరిధిలోని అల్లాపూర్​లో నివసించే సయ్యద్​ షాహిద్​(22) రౌడీషీటర్​. పలువురి వద్ద మామూళ్లు వసూలు చేయడంతో పాటు సెటిల్​మెంట్లు చేస్తుంటాడు. తన ఏరియాకు చెందిన సాజిద్​, హనూక్​ అలియాస్​ మున్నా, సమీర్​ఖాన్​తో కలిసి పలు దందాలు చేశాడు. దీంతో వీరు ఆయనను బాగా గమనించి.. తనలా క్రేజ్​ సంపాదించాలని అనుకున్నారు. అతడిని చంపేస్తే తామే పెద్ద రౌడీలుగా చెలామణి అవ్వొచ్చని భావించారు. పథకం ప్రకారం జూన్​ 29న రాత్రి కూకట్​పల్లిలో తమ ఫ్రెండ్ బర్త్​డే పార్టీ ఉందని నమ్మించి షాహిద్​ని పిలిపించారు. నిర్జన ప్రదేశంలో మద్యం తాగించి బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత బండరాయి తలపై వేసి హత్య చేశారు. ముగ్గురు నిందితులని పోలీసులు రిమాండ్​కు తరలించారు.