బుమృక్నుద్దౌలా, కూకట్ పల్లి నల్లచెరువులు రెడీ.. ఇప్పటికే అందుబాటులోకి బతుకమ్మ కుంట

బుమృక్నుద్దౌలా, కూకట్ పల్లి నల్లచెరువులు రెడీ.. ఇప్పటికే అందుబాటులోకి బతుకమ్మ కుంట

హైదరాబాద్ సిటీ, వెలుగు: పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న కూకట్ పల్లి నల్ల చెరువు, ఓల్డ్ సిటీలోని బుమృక్నుద్దౌలా చెరువులను వచ్చే వారం సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు. బుధవారం నల్లచెరువును సందర్శించిన హైడ్రా చీఫ్​ రంగనాథ్​ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, నగరంలో చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి హైడ్రా ఆక్రమణలను తొలగించడంతో పాటు పునరుద్ధరణ పనులు చేస్తున్నది.

మొదటి దశలో రూ.58.50  కోట్లతో బతుకమ్మ కుంట, ఉప్పల్ పెద్ద చెరువు, కూకట్​పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట, గుట్టల బేగంపేట్ సున్నం చెరువు, శివరాంపల్లి బుమృక్నుద్దౌలా చెరువుల పునర్నిర్మాణ  పనులను చేపట్టింది. బతుకమ్మ కుంట పనులు పూర్తి చేయగా, సీఎం ప్రారంభించారు. బుమృక్నుద్దౌలా,  నల్లచెరువు పనులు కూడా కంప్లీట్​కాగా, మాదాపూర్‌‌ తమ్మిడికుంట చెరువు పనులు చివరిదశలో ఉన్నాయి. మొదటి దశలో మిగిలిన 3 చెరువుల పనులు కూడా త్వరగా పూర్తి చేసి రెండో విడత పనులు చేపట్టాలని హైడ్రా ప్లాన్ చేస్తుంది.

బుమృక్నుద్దౌలాకు 255 ఏండ్ల చరిత్ర
హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్​ఉద్‌‌దౌలా  బుమృక్నుద్దౌలా చెరువును 1770 లో నిర్మించారు. అప్పట్లో ఈ చెరువు 100 ఎక‌‌రాల‌‌కు పైగా విస్తరించి ఉండేది. రాజేంద్రన‌‌గ‌‌ర్‌‌, ఆరాంఘ‌‌ర్‌‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌‌చ్చే వ‌‌ర‌‌ద ఈ చెరువుకు చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్​ను రాజులు, బుమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాల‌‌కు వాడుకునేవారు. 

బుమృక్నుద్దౌలా చెరువులో వ‌‌న‌‌మూలిక‌‌ల చెట్లు, కొమ్మలు వేసి, దిగువున నిర్మించిన బావిలోకి వ‌‌చ్చిన ఊట నీటిని తాగే వారు. ఔష‌‌ధ‌‌ గుణాలున్న ఈ నీటిని నిజాంలు మాత్రమే తాగేవారు. చెరువు చుట్టూ సువాస‌‌న‌‌లు వెద‌‌జ‌‌ల్లే పూల మొక్కలు పెంచేవారు. ఆ పూల‌‌న్నీ చెరువులో పడేలా చేసి నీటిని సెంటు త‌‌యారీకి వినియోగించేవారు. అర‌‌బ్ దేశాల‌‌కు కూడా ఇక్కడి నీటిని తీసుకువెళ్లేవారని చెప్పుకుంటారు. గతమెంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ చెరువును మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తుండడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పూర్వ స్థితికి న‌‌ల్ల చెరువు 
30 ఎకరాలున్న కూక‌‌ట్‌‌ప‌‌ల్లి న‌‌ల్ల చెరువు ఆక్రమ‌‌ణ‌‌ల‌‌తో 16 ఎక‌‌రాలుగా మిగిలింది. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌‌మాచారంతో పూర్త విస్తీర్ణానికి హైడ్రా తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్​పరిధిలో నిర్మించిన 16 షెడ్లను తొల‌‌గించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాల‌‌తో పాటు ద‌‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌‌ను తొలగించింది. దీంతో 4 మీట‌‌ర్ల లోతు పెరిగింది. చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే నిర్మించారు. 

ఇప్పుడే వాకింగ్ కోసం రోజూ 600 మంది వస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మారుతున్నాయని అధికారులు చెప్తున్నారు. చెరువులో ఐల్యాండ్స్ నిర్మాణంతోపాటు  బోటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. చెరువు పక్కన కమ్యూనిటీ హాల్స్​తో పాటు పెద్దవాళ్లు సేదతీరేందుకు గ‌‌జ‌‌బో (విశ్రాంతి మందిరం) నిర్మించారు.