కుమ్రం భీం మనమరాలు సోంబాయి ఇంకా గూన ఇంట్లనే

కుమ్రం భీం మనమరాలు సోంబాయి ఇంకా గూన ఇంట్లనే
  • జోడేఘాట్ లో 50 డబుల్ బెడ్రూ ఇండ్లు కట్టిస్తానని సీఎం చెప్పి ఆరేండ్లాయె 
  • పోరుబాటలు వేసిన 12 ఊళ్లకు రోడ్లు కూడ సక్కగ లేవు 
  • మట్టి ఇండ్లు,గుడిసెలోనే వీరుల వారసులు

కుమ్రం సోంబాయి.. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం సేనలపై తిరగబడ్డ వీరుడు కుమ్రం భీంకు స్వయంగా మనవరాలు. పోరుగడ్డ జోడేఘాట్ కేంద్రంగా ఆమెకు, ఆమెతో పాటు ఊరిలోని 50 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లుకట్టిస్తానని 2014లో సీఎం కేసీఆర్, 2016లో ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ వారి హామీలు అమలు కావడం లేదు. ఆ ఊరుతో పాటు నాడు నిజాంపై పోరాటం చేసిన మరో 11 ఊరకు రోడ్లు కూడా సరిగ్గాలేవు.

గట్టివానకు కూలే ఇండ్లు

నిజాం సేనలపై కుమ్రంభీం అలెగ్జాండర్  ఎగిరేసిన ప్రాంతంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్ గుర్తింపు పొందింది. జల్, జంగల్, జమీన్ కోసం భీం ఆధ్వర్యంలో ఇక్కడి 12 ఊళ ప్రజలు  నాడు ప్రాణాలకు తెగించి పోరాడి చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా జోడేఘాట్ దాని చుట్టు పక్కల పోరుగ్రామా లైన కొలాంగూడ , పాట్నపూర్, పెద్దపాట్నపూర్ , శివగుడా, బాబేఝరి, మహరాజ్ గుడా, పాటగుడా , చాల్ బాడీ, టోకెన్ మోవాడ్, లైన్ పటార్, పిట్టగు డాల్లోరోడ్లు, డ్రైనేజీల్లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఎప్పుడు కూలుతాయో తెలియని మట్టి ఇండ్లు, గుడిసెల్లోఆ వీరుల వారసులు భయం భయంగా బతుకుతున్నారు. గట్టి వాన కొడితే కూలిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ హామీకి ఆరేండ్లు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అక్టోబర్ 8 న సీఎం కేసీఆర్ జోడేఘాట్లో నిర్వహించిన కుమ్రం భీం వర్దంతి, గిరిజన దర్బార్ కు హాజరయ్యారు. కుమ్రం భీం వారసులు ఇంకా మట్టి ఇండ్లలో ఉండడాన్నిచూసిన ముఖ్యమంత్రి.. కుమ్రం భీం మనుమరాలు కుమ్రం సోంబాయితో పాటు జోడేఘాట్లోని 50 గిరిజన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 ఊళ్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భీం వర్ధంతి  కోసం 2016 లో మంత్రి కేటీఆర్, అప్పటి గిరిజన శాఖ మంత్రి చందూలాల్ వచ్చారు. గిరిజనులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ మాటిచ్చారు. తండ్రీ కొడుకులిద్దరూ హామీ ఇచ్చారు కదా, త్వరలోనే పక్కాఇండ్లు వస్తాయని కుమ్రం భీం మనవరాలు సహా గిరిజనులంతా ఆశించారు. ఇప్పటికి ఐదారేండ్లు గడిచిపోయాయి. కానీ జోడేఘాట్ లో నేటికీ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు. దీంతో కుమ్రం భీం వారసులకు గుడిసెలు, గూన పెంకల ఇండ్లేదిక్కయ్యాయి.

 ఇంటర్నల్ రోడ్లు అధ్వాన్నం..

నిజాం సేనలపై పోరాడిన 12 ఊళ్లలో  రోడ్లు అధ్వా న్నంగా ఉన్నాయి. వర్షం వస్తే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఊళ్లను  ప్రధాన రోడ్డుతో కలిపే హట్టి– జోడేఘాట్ రోడ్డు టోకెన్ మోవాడ్ వద్దఅసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో ఆయా ఊళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోడేఘాట్ నుంచి డెమ్మిడిగుడా వరకు రోడ్డు వేయాలనే డిమాండ్ ఏండ్లుగా పెండింగ్లో ఉంది.

వాన కొడితే ఇల్లు ఉరుస్తది 

మా ఊళ్లలో అందరికీ డబుల్  బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని సీఎం సార్ చెప్పిండు. ఇప్పటిదాకా ఒక్క ఇంటికి పునాది పడలేదు. అందరం గూన పెంకల  ఇండ్లు, గుడిసెల్లో ఉంటున్నం. వానకు ఉరుస్తున్నాయి. మట్టితో కట్టినయ్ కదా గట్టి వాన పడితే కూలతాయని బుగులైతాంది. ఆఫీసర్లు జల్దీ ఇండ్లు కట్టియ్యాలె .జోడేఘాట్ -హటిట్ రోడ్డు మంచిగ చేయాలె- కుమ్రం సోంబాయి

అసంపూర్తిగా జోడేఘాట్ రోడ్డు

హామీలు తప్ప ఏం చేస్తలేరు సీఎం కేసీఆర్ జోడేఘాట్ వచ్చినప్పుడు 50 డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని మాట ఇచ్చిండు. ఆరేండ్లయినా ఇప్పటిదాకా పనులు షురూ చేయలేదు. కుమ్రం భీం వారసుల మంతా ఇప్పటికీ గుడిసెల్లోనే బతుకుతున్నం. యేటా భీం వర్ధంతికి నాయకులు రావడం, హామీలు ఇచ్చిపోవుడు తప్ప ఏ పనీ చేస్తలేరు.

-పెందోర్ రాజేశ్వర్, కుమ్రం భీం వర్ధంతి కమిటీ చైర్మన్