- తేజస్వి సూర్యను అనర్హుడిగా ప్రకటించాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: చట్టసభల స్థానాల పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని కేంద్రం చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం మఖ్ధూం భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచితే దక్షిణాది సీట్లు 129 నుంచి 195కి మాత్రమే పెరుగుతాయని, అదే సమయంలో ఉత్తరాది సీట్లు 395 నుంచి 621కి పెరుగుతాయని, దీనివల్ల దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఇందిరా గాంధీ, వాజ్ పేయిలు సైతం 2026 వరకు సీట్ల పెంపును నిలిపివేశారని గుర్తు చేశారు. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, రాజ్యాంగ నిపుణులతో కమిటీ వేసి అన్నిరాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రావడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. 1960లోనే సీపీఐ ఎంపీ రేణుక చక్రవర్తి ఈ అంశాన్ని లేవనెత్తారని, గీతా ముఖర్జీ కమిటీ నివేదిక మేరకే నేడు బిల్లు ఆచరణలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటును పాక్తిసాన్ పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యుడిగా అనర్హులని కూనంనేని అన్నారు. సమావేశంలో సీపీఐ నేతలు పశ్య పద్మ, ఈటీ నరసింహ, కలవేణ శంకర్ పాల్గొన్నారు.

