గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న విధ్వంసం కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో రెండో సారి.. కువైట్ లోని ఆయిల్ రిఫైనరీలపై మళ్లీ డ్రోన్ బాంబులతో విచుకుపడింది ఇరాన్ దేశం. 2026, మార్చి 20వ తేదీ ఉదయం.. కువైట్ లోని అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన మినా అల్ అహ్మది రిఫైనరీగా టార్గెట్ గా.. ఇరాన్ డ్రోన్ బాంబులు వేసింది. గుంపులు గుంపులుగా వచ్చిన డ్రోన్ బాంబులు.. రిఫైనరీలోని చాలా భాగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లు కువైట్ సర్కార్ ప్రకటించింది. ప్రాణ నష్టం జరగలేదని చెప్పిన కువైట్.. రిఫైనరీలోని చాలా యూనిట్లలో మంటలు వ్యాపించాయని.. అదుపు చేస్తున్నామని.. రిఫైనరీలో తాత్కాలికంగా ఇంధన ఉత్పత్తికి బ్రేక్ పడినట్లు కువైట్ వెల్లడించింది.
మినా అల్–అహ్మదీ ఆయిల్ రిఫైనరీని శుక్రవారం (మార్చి 20) ఇరాన్ డోన్స్ టార్గెట్ చేసినట్లు కువైట్ ప్రకటించింది. డ్రోన్ దాడిలో పలు రిఫైనరీ యూనిట్లు ధ్వంసం అయినట్లు పోర్కొంది. కువైట్ లో ఈద్ అల్–ఫితర్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా డ్రోన్స్ దాడి జరగటంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆయిల్ కేంద్రాలలో అంటుకున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. కానీ ఆయిల్ రిఫైరీలు నష్టపోయినట్లు తెలిపారు.
ఇరాన్ లోని సౌత్ పార్స్ ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత యుద్ధం స్వరూపం మారిపోయిందనే చెప్పాలి. తమ ఆయిల్, గ్యాస్ రీఫైనరీలపై దాడులు చేస్తే.. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బకొడతామని ఇరాన్ ప్రకటించింది. అన్నట్లుగానే గురువారం ఖతార్, సౌదీ అరాంకో కు చెందిన SAMREF మొదలైన రిఫైనరీలపై దాడులు చేసింది ఇరాన్. ఇవే కాకుండా కువైట్, సౌదీ, యూఏఈ తదితర దేశాల రిఫైనరీలను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతోంది. ఇప్పటికే కువైట్ రిఫైనరీలపై దాడులు చేసిన ఇరాన్.. శుక్రవారం మరోసారి రిఫైనరీలను టార్గెట్ చేస్తూ దాడికి దిగటం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం.
