తొగుట(దౌల్తాబాద్) వెలుగు: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని కార్మిక, మైనింగ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేశ్ పంచమి మంత్రిని కలిశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. కలెక్టర్ హైమావతితో ఫోన్‌లో మాట్లాడి లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వీలైనంత త్వరగా పట్టాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయాలని నాయకులు కోరగా, ఆ ప్రతిపాదనను కూడా పరిశీలించి మంజూరు చేయడానికి మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
