లక్షద్వీప్​లో మహిళల వెతలు..దీవుల్లో విద్య, వైద్య సేవల కొరత

లక్షద్వీప్​లో మహిళల వెతలు..దీవుల్లో విద్య, వైద్య సేవల కొరత

అగత్తి: లక్షద్వీప్.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన సముద్రం, బీచులు, కొబ్బరి చెట్లతో కూడిన ప్రకృతి సౌందర్యం గుర్తుకు వస్తుంది. ప్రధాని మోదీ ఇటీవలే అక్కడ పర్యటించారు. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అక్కడి బీచ్ పై కుర్చీలో కూర్చుని తాను దిగిన ఫొటోను సోషల్  మీడియాలో ఆయన షేర్ చేశారు. దీంతో లక్షద్వీప్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 

పర్యాటకుల రద్దీ పెరిగింది. అయితే, ఈ అందమైన దీవుల్లో మహిళల పరిస్థితి మాత్రం దుర్భరంగా ఉంది. లక్షద్వీప్ దీవుల్లోని ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవు. గైనకాలజిస్టులు లేరు. సానిటరీ న్యాప్ కిన్లను సేకరించేందుకు, వాడిన న్యాప్ కిన్లను పారేసేందుకు డిస్పోజల్  మెషిన్లు లేవు. దీనిపై నేతలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయిందని అగత్తి ఐలాండ్​లో స్వశక్తి సంఘాల లీడర్ సల్మాత్  చెప్పారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమ సమస్యలపై మరింత తీవ్రంగా గళమెత్తుతున్నామని ఆమె చెప్పారు. 

‘న్యాప్ కిన్లను డిస్పోజ్ చేసే వ్యవస్థ లేక వాటిని ఇంటి పరిసరాల్లోనే తగులబెట్టాల్సి వస్తోంది. ప్లాస్టిక్​ను కాల్చేస్తుండడంతో కాలుష్యం పెరిగిపోతోంది. అగత్తి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 57,574 కాగా అందులో మహిళలు 28,442 మంది ఉన్నారు. అయినా కూడా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యంలేదు. మా సమస్యల గురించి ఏ లీడర్​ మాట్లాడడు. ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల కోసం విజ్ఞప్తి చేసినా పట్టించుకుంటలేరు” అని సల్మాత్ ఆవేదన వ్యక్తం చేశారు.

గర్భిణీల పరిస్థితి దుర్భరం

లక్షద్వీప్  దీవుల్లో గర్భిణీల పరిస్థితి దారుణంగా ఉందని సల్మాత్  తెలిపారు. చాలామంది గర్భిణీలకు మెడికల్ సపోర్ట్ లేదన్నారు. చెకప్​కు ప్రతిసారీ కవరత్తికి వెళ్లాల్సిందేనని వెల్లడించారు. ట్రాన్స్​పోర్ట్ సమస్యలతో బాలికలుఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. ‘ఈ దీవుల్లో ఒకే ఒక్క దీవి డిగ్రీ కోర్సును ఆఫర్  చేస్తోంది. ఆపై చదువులకు కేరళకు వెళ్లాల్సిందే’ అని సల్మాత్ వెల్లడించారు. 

కాగా, మొదటి దశ పోలింగ్​లో లక్షద్వీప్​లో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎంపీ, ఎన్సీపీ (శరద్  పవార్  వర్గం) లీడర్  మొహమ్మద్  ఫైజల్, కాంగ్రెస్ లీడర్ హమ్దుల్లా సయీద్ ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. అజిత్  పవార్  వర్గానికి చెందిన ఎన్సీపీ లీడర్ టీపీ యూసుఫ్​ కూడా ఈసారి పోటీ చేస్తున్నారు.