- ముగిసిన మూడ్రోజుల గడువు
- అప్లికేషన్లు తీసుకుంటామని కొన్నిచోట్ల అధికారుల ప్రకటన
- దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద సొంత జాగాలో ఇల్లు కట్టుకునేటోళ్లకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుండడంతో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు గురువారమే ఆఖరు అని చెప్పడంతో వేలాది మంది మండల కేంద్రాలకు తరలివచ్చారు. కేవలం మూడ్రోజుల్లోనే 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. ఒక్కో మండల కేంద్రంలో 2 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా మండలాల్లో 12 లక్షల దాకా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. మున్సిపాలిటీల్లోనూ పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి.
ఈ రెండూ కలిపితే దరఖాస్తుల సంఖ్య 17 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా వెల్లడించడం లేదు. ఒకవేళ రానున్న రోజుల్లోనూ అప్లికేషన్లు తీసుకుంటే, దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గురువారం ఆఖరు అని చెప్పడంతో వేలాది మంది మండల కేంద్రాలకు తరలివచ్చారు. సంబంధిత డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటిని తీసుకునేందుకు తిప్పలు పడ్డారు. కేవలం మూడ్రోజులే గడువు ఇవ్వడంపై చాలాచోట్ల జనం ప్రశ్నించారు. దీంతో ఎవరైనా మిగిలిపోతే అప్లికేషన్లు తీసుకుంటామని కొన్నిచోట్ల అధికారులు ప్రకటించారు.
అప్లికేషన్ తీసుకుని రసీదు ఇస్తలేరు..
గృహలక్ష్మిఅప్లికేషన్లను అధికారులు కట్ట కట్టి పక్కన పెడుతున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత దరఖాస్తుదారులకు కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. కంప్యూటర్లోనూ ఆ వివరాలను నమోదు చేయడం లేదు. దీంతో తమ అప్లికేషన్లను ఏం చేస్తారోనని అర్హులు ఆందోళన చెందుతున్నారు. తాము గృహలక్ష్మి కింద అప్లికేషన్ పెట్టుకున్నమని కానీ ఇంతవరకు రాలేదని, ఎందుకు రాలేదు అని అడిగేందుకు ఎలాంటి ఆధారం ఉండటం లేదని వారు వాపోతున్నారు. అప్లికేషన్ తీసుకున్నట్టు రసీదు ఇస్తే, లేనిపోని తలనొప్పి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే అప్లికేషన్ మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిసింది.
నియోజకవర్గానికి 3 వేల మందికే..
గృహలక్ష్మి పథకం కింద మూడు విడతల్లో రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నియోజకవర్గానికి 3 వేల మందికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. అయితే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందకపోవడంతో గృహలక్ష్మి కింద పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. మరికొన్ని రోజులు అప్లికేషన్లు తీసుకుంటే ఎన్ని లక్షలు వస్తాయోనని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఇప్పుడే నియోజకవర్గానికి యావరేజ్‌గా 13 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఈ సంఖ్య 20 వేల దాకా పోయే చాన్స్ కూడా ఉందని అధికారులు అంటున్నారు. అయితే అర్హులను తేలిస్తే, ఈ సంఖ్య కాస్త తగ్గొచ్చని.. అయినప్పటికీ ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువ మందికే గృహలక్ష్మి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

