హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 72 ఫిర్యాదులు అందగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వీకరించారు. మల్కాజిగిరి మండలం రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలోని లేఅవుట్లో పార్కు స్థలాన్ని కబ్జా చేశారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో సెప్టిక్ ట్యాంకు, వాటర్ ట్యాంకర్ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ స్థలాన్ని కాపాడాలని నివాసితులు కోరారు. మణికొండ ల్యాంకో హిల్స్ సమీపంలోని ఎల్లమ్మ చెరువును నలువైపులా కబ్జా చేసి, రేసు కోర్సు, క్రికెట్ గ్రౌండ్, పక్కనే పార్కింగ్తో రియల్టర్లు ఆక్రమణలు చేస్తున్నారని, 3 నెలల్లో బిల్డింగ్ కట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు హద్దులను నిర్ధారించి ఆక్రమణలను అరికట్టాలని కోరారు.
