- పరిహారం తక్కువంటూఆస్తులు ఇవ్వని ఓనర్లు
- మార్కెట్ విలువ పెంచితే ఇస్తారని సర్కారు ఆలోచన
- నెలాఖరులోపు నిర్ణయం
- జూన్ మొదటివారంలో ఓనర్లతో మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం, ఆ స్థాయిలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పెరగకపోవడంతో ట్రాఫిక్తిప్పలు తప్పడం లేదు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, రోడ్డు విస్తరణ, మల్టీ లెవెల్ కారిడార్లు చేపడుతోంది. ప్రస్తుతం 3 కార్పొరేషన్ల పరిధిలో రూ.7 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
కానీ, ఈ ప్రాజెక్టుల అమలుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యతో చాలా చోట్ల టెండర్లు పూర్తయినా పనులు మొదలుకావడం లేదు. ఆస్తులు ఇచ్చే యజమానులకు క్యాష్రూపంలో అయితే ప్రభుత్వ విలువకు రెండింతలు, టీడీఆర్ అయితే నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తున్నారు. అయినా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉందని యజమానులు భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో భూముల మార్కెట్ వ్యాల్యూని పెంచేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. దీనివల్ల ఆస్తులు ఇవ్వడానికి యజమానులు ముందుకు వస్తారని, కీలక ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందులు తప్పుతాయని అధికారులు అంటున్నారు.
మార్కెట్ రేటు లక్షల్లో.. ఉన్నది వేలల్లో..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల మార్కెట్ రేట్లక్షల్లో ఉండగా, ప్రభుత్వ విలువ మాత్రం గజానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు భారీగా పెరిగినప్పటికీ.. ప్రభుత్వ విలువ గజానికి రూ.60 వేలే.. నిజానికి రూ. కోట్ల విలువ చేసే ఈ ఆస్తులకు ప్రభుత్వ లెక్కల్లో చాలా తక్కువ పరిహారం వస్తుండడంతో ఆస్తులను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరైతే కోర్టులను ఆశ్రయిస్తుండడంతో పనులన్నీ పెండింగ్‌లో పడిపోతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ప్రాజెక్టులు, గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులే దీనికి ఉదాహరణ.
ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుల కోసం 453 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, అసంతృప్తితో యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం భూసేకరణ లేని చోట మాత్రమే పనులు మొదలుపెట్టారు. రోడ్ల విస్తరణ పనులు, లింక్ రోడ్ల నిర్మాణం ఇతర పనులపై కూడా ఈ ప్రభావం పడింది. దీంతో ఈ విషయాన్ని గురించి ఆలోచించిన సర్కారు ఈ నెలాఖరులోపు భూముల విలువ రేషనలైజ్ చేసి ఫైనల్ రేట్లు ప్రకటించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జూన్ మొదటివారంలో ఆస్తులు కోల్పోతున్న యజమానులతో మీటింగ్ పెట్టి కొత్తగా వచ్చిన రేట్లతో పరిహారం గురించి చర్చించే అవకాశం ఉంది.
