- గ్రామం యూనిట్‌గా ఎంజాయ్‌మెంట్ సర్వేను సూచిస్తున్న నిపుణులు
- రికార్డులకు.. ఫీల్డ్‌లో వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి
- తేల్చకుండా ‘మ్యాపింగ్’కు ఇబ్బందులు
- నిత్యం ఏదో ఒకచోట రైతుల గట్టు పంచాయితీలు
- భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ ఆశయం మంచిదే అయినా ఆచరణలో అన్నీ అడ్డంకులే
- ప్రయోగాత్మక ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో పెను సవాళ్లను విసురుతున్నది. భూమి అమ్మకం, కొనుగోలు సమయంలోనే సర్వే నిర్వహించి మ్యాప్ ఇవ్వాలనే నిబంధన సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోస్తోంది. పక్కాగా సరిహద్దులు నిర్ణయించకుండా, పాత రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ల వద్ద మ్యాపింగ్ కోరడం వల్ల పొరుగు రైతులతో ఘర్షణలు తలెత్తి రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి.
అలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సమగ్ర ‘ఎంజాయ్‌మెంట్ సర్వే’ నిర్వహించి, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సరిహద్దులు ఖరారు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ నిబంధన అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీతో పాటు కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఆధునిక సాంకేతికతతో విజయవంతంగా అమలు చేసిన, చేస్తున్న విధానాలను ఇక్కడ పరిశీలించాలని సూచన చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాల వరకు రికార్డులకు, క్షేత్రస్థాయికి మధ్య పొంతన లేదని తెలుస్తోంది. పట్టా భూముల్లో ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పటికీ అసైన్డ్, సీలింగ్ ఇతర ప్రభుత్వల్యాండ్ విషయాల్లో ఈ గందరగోళం ఎక్కువగా నెలకొంది. అయితే, పట్టా భూముల్లో ఒక గుంట, రెండు గుంటలు తేడా వచ్చిన క్షేత్రస్థాయిలో గొడవలకు దారితీస్తోంది.
గెట్టు గొడవలతో నిలిచిపోతున్న విక్రయాలు!
ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ప్రస్తుతం ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ భూ రికార్డుల ప్రక్షాళనకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును ఈ నెలలో ప్రారంభించారు.
ఈ నూతన పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సర్వేతో అనుసంధానిస్తూ, భూముల సరిహద్దులను డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నప్పుడు సరిహద్దుల విషయంలో పొరుగు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి.
ఈ ఐదు మండలాల్లో ఎదురవుతున్న సాంకేతిక ఆచరణాత్మక ఇబ్బందులను అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలను విస్తరించాలని భావి స్తోంది. అయినప్పటికీ, సమగ్ర సర్వే జరగకుండా కేవలం రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ నిబంధన పెట్టడంతో రైతులకు తలనొప్పులు తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేయడం వెనుక సదుద్దేశం ఉన్నప్పటికీ, ఆచరణలో అనేక సాంకేతిక సామాజిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం భూమి అమ్మకం లేదా కొనుగోలు సమయంలోనే సర్వే నిర్వహించాలనే నిబంధన, క్షేత్రస్థాయిలో సరిహద్దుల విషయంలో రైతుల మధ్య అనవసరమైన ఘర్షణలకు దారితీస్తోంది.
దశాబ్దాలుగా సాగులో ఉన్న భూమికి, పాత రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసాలు ఉండడం వల్ల, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే చేసినప్పుడు పక్క రైతులతో గొడవలు మొదలై ప్రక్రియ నిలిచిపోతోంది. దీంతో అమ్మే రైతుకు అత్యవసర సమయంలో డబ్బు అందక, ఇటు కొనే వ్యక్తికి భూమిపై స్పష్టత లేక ఇద్దరూ ఆందోళన చెందుతున్నారు. కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద నిబంధనలు బిగించడం కంటే, ముందుగా రికార్డులను క్షేత్రస్థాయి వాస్తవాలతో సరిపోల్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.
సమగ్ర రీసర్వేనే ఏకైక మార్గం..
ప్రస్తుత ఇబ్బందులను అధిగమించాలంటే ముక్క లు ముక్కలుగా సర్వేచేసే విధానానికి స్వస్తి పలికి, సమగ్ర రీ-సర్వే చేపట్టడమే ఏకైక మార్గమని రెవెన్యూ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాటిలైట్ ఇమేజరీ, హై-రిజల్యూషన్ డ్రోన్ సర్వేల ద్వారా గ్రామం మొత్తాన్ని ఒకేసారి కొలవడం వల్ల సరిహద్దు వివాదాలు గ్రామ సభల ద్వారా అక్కడికక్కడే పరిష్కారమవుతాయంటున్నారు.
ఒకవైపు సర్వే జరుగుతూనే, మరోవైపు రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ ‘ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్’ చేపట్టాలి. ఇలా శాశ్వత ప్రాతిపదికన సరిహద్దులు నిర్ణయించిన తర్వాత, ఆ మ్యాపులను భూభారతి వంటి పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేస్తే, రిజిస్ట్రేషన్ల సమయంలో మళ్లీ కొత్తగా కొలతలు వేయాల్సిన అవసరం ఉండదు.
ఇది అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఇటు సామాన్య రైతుకు సర్వే అధికారుల చుట్టూ తిరిగే బాధను తప్పించి, భూమికి పూర్తి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, రైతులకు యూనిక్ ఐడీ క్యూఆర్ కోడ్ కలిగిన 'భూ రక్ష' కార్డులను పంపిణీ చేశారు.
సర్వే మ్యాప్‌ల డిజిటల్ రికార్డులకు రాష్ట్రాల కుస్తీ!
భూముల రీ-సర్వే అంశంలో వివిధ రాష్ట్రాలు విభిన్న ఫలితాలను చూశాయి. గుజరాత్ రాష్ట్రం శాటిలైట్ ఇమేజరీ గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా రికార్డులను ఆధునీకరించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, కర్నాటక 'భూమి' ప్రాజెక్ట్ ద్వారా డిజిటలైజేషన్‌లో సక్సెస్ అయింది. అయితే, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కేవలం శాటిలైట్ ఇమేజరీపైనే ఆధారపడి, క్షేత్రస్థాయి ఎంజాయ్‌మెంట్ సర్వేను విస్మరించడం వల్ల రికార్డులకు, వాస్తవ సాగుకు మధ్య భారీ వ్యత్యాసాలు వచ్చి సర్వే ప్రక్రియ వివాదాస్పదమైంది.
మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో డ్రోన్ సర్వే విజయవంతమైనప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల గుర్తింపులో సాంకేతిక లోపాల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. బిహార్ వంటి రాష్ట్రాల్లో పాత రికార్డుల లభ్యత లేకపోవడం సరిహద్దుల నిర్ణయంలో గ్రామ సభల మద్దతు లభించకపోవడంతో రీ-సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

