
హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో అర్ధరాత్రి దాడి కలకలం రేపింది. రోడ్ నంబర్ 3 లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లో జరిగిన గొడవ కాలనీ వాసులను భయాందోళనలకు గురిచేసింది. కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసుల సమాచారం ప్రకారం... రాత్రి సమయంలో హాస్టల్ సమీపంలో వెళ్తున్న ఓ యువతిపై దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ బ్యాచ్ మద్యం మత్తులో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వెంకటేష్ అనే వ్యక్తి వారిని ఆపుతూ, ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించాడు. ఈ మాటలపై ఆగ్రహించిన గ్యాంగ్ వెంకటేష్‌పై దాడి చేసింది. దీంతో వెంకటేష్ శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు.
అప్పటికీ వదలని గ్యాంగ్ హాస్టల్‌లోకి దూసుకెళ్లి కర్రలతో కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం వెంకటేష్ ను దారుణంగా కొట్టారు. ఈ ఘటనతో హాస్టల్‌లో ఉన్న ఇతర విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు.
రాత్రి చదువుకుంటూ ఉండగా ఒక్కసారిగా కిటికీలు పగలగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో భయాందోళనకు గురయ్యాం అని హాస్టల్ విద్యార్థులు చెప్పారు.
విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం, అతని గ్యాంగ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్, అసభ్యకర వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.