లా మినిస్టర్‌‌కు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రిక్వెస్ట్.. మంత్రి రిప్లై

లా మినిస్టర్‌‌కు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రిక్వెస్ట్.. మంత్రి రిప్లై

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జిల కొరత తీర్చేందుకు ఖాళీల భర్తీకి కొలీజయం ప్రయత్నిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇప్పటికే సుప్రీంలో భర్తీ చేయగా.. హైకోర్టుల్లో ఉన్న ఖాళీలు ఫిల్ చేసేందుకు 82 పేర్లను నిన్ననే పంపామని చెప్పారు.  శనివారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానం చేసింది. ఈ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్‌‌ కౌన్సిల్ ప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు, లాయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. హైకోర్టుల్లో జడ్జిల కొరతపై వేగంగా స్పందించాలని రిక్వెస్ట్ చేశారు. 12 హైకోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం భారీ లిస్టును పంపామని, లా మినిస్టర్ ఇక్కడే ఉన్నారని, ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిల భర్తీకి పంపిన లిస్టును ఆమోదించినట్లే.. హైకోర్టుల కోసం ప్రస్తుతం ప్రతిపాదించిన పేర్లను కూడా ప్రభుత్వం వేగంగా ఆమోదించి పంపుతుందని ఆశిస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

లా మినిస్టర్ రెస్పాన్స్‌

సన్మాన సభలో కొద్దిసేపటి తర్వాత ప్రసంగించిన లా మినిస్టర్ కిరెణ్ రిజిజు.. సీజేఐ రిక్వెస్ట్‌పై స్పందించారు. కొలీజియం ప్రతిపాదించిన పేర్ల గురించి తాను మాట్లాడలేనని, అయితే సానుకూల నిర్ణయమే ఉంటుందని అన్నారు. అంతేకాదు సీజేఐ ప్రసంగంలో చిన్న సరదా కామెంట్ చేయగా దానిపైనా కేంద్ర మంత్రి రియాక్ట్ అయ్యారు. తాను తొలిసారి లా మినిస్టర్ రిజిజును కలిసినప్పుడు ఆయనను కాలేజీ స్టూడెంట్ అనుకున్నానని, అయితే వయసు ఎంతో చెప్పాలని ఒత్తిడి చేయలేదని అన్నారు. దీనిపై స్పందించిన రిజిజు నాడు జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. తనకు లా డిగ్రీ ఉందని, ప్రాక్టీస్ చేసిన అనుభవం మాత్రం చేయలేదని జస్టిస్ ఎన్వీ రమణకు చెప్పానని అన్నారు.