
- సెక్రటేరియేట్ ముట్టడికి నేతల యత్నం, అరెస్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వామపక్ష విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్ బీ, ఏఐపీఎస్ యూ) డిమాండ్ చేశాయి. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయా సంఘాలు స్కూళ్లు, కాలేజీల బంద్ నిర్వహించాయి. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు చలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని చేపట్టారు.
లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియెట్ వైపు ర్యాలీగా వస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా ముషీరాబాద్, బోయిన్ పల్లితో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్, పీడీఎస్యూ రాష్ట్ర నేతలు అనిల్, నాగరాజు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉన్నప్పటికీ, ఫలితాలు వచ్చేలా సమీక్షలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటు విద్యాసంస్థలను సందర్శిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు హకీం నవీద్, నితీష్, మనేకుమార్, వెంకటర్ రెడ్డి, ఎం.మమత, డి.కిరణ్ తదితర విద్యార్థి నేతలు పాల్గొన్నారు. కాగా, అరెస్టులను నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.