కూసుమంచి, వెలుగు : రెండు రోజుల్లో సాగర్ రెండో జోన్ ఎడమ కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నట్లు జిల్లా ఇరిగేషన్ సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ ఎడమ కాలువకు నీటిని నిలిపివేసి, గేట్ల లీకేజీని గడ్డితో పూడ్చినట్లు తెలిపారు. 2024 సెప్టెంబర్‌లో వరదల సమయంలో పాలేరు జలాశయానికి దిగువన విద్యుత్‌ఉత్పత్తి కాల్వ కట్ట తెగి వరద ప్రధాన కాల్వకు పోటెత్తింది.
కాల్వతో పాటు యూటీ నిర్మాణం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేసింది. సుమారు రూ.5 కోట్లతో ధ్వంసమైన యూటీ నిర్మాణం చేపట్టారు. మిగిలిన రూ.8 కోట్లతో రంగుల బ్రిడ్జి, ఎడమ కాలువ వద్ద లైనింగ్, రివిట్మెంటు పనులు రెండు రోజుల్లో చేపడుతున్నట్లు సీఈ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
