లెండిని 2027 మే నాటికి పూర్తి చేస్తాం...కోఆర్డినేషన్ మీటింగ్ లో మహారాష్ట్ర వెల్లడి

లెండిని 2027 మే నాటికి పూర్తి చేస్తాం...కోఆర్డినేషన్ మీటింగ్ లో మహారాష్ట్ర వెల్లడి
  •     అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఆలస్యంపై తెలంగాణ అభ్యంతరాలు
  •     అంచనా వ్యయం భారీగా పెరుగుతోందని ఆందోళన
  •     రూ.196 కోట్లు డిపాజిట్ చేయాలన్న మహారాష్ట్ర  

హైదరాబాద్, వెలుగు: కొన్ని దశాబ్దాలుగా పెండింగ్​లో పడిన లెండి అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు కథ ముందుకు కదిలింది. ఇన్నేండ్లు ప్రాజెక్టును లేట్ చేస్తూ వచ్చిన మహారాష్ట్ర సర్కారు.. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించింది. మంగళవారం జలసౌధలో రెండు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ బోర్డు (ఐఎస్​బీ)12వ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని అధికారులు ఎత్తిచూపారు.

ఎప్పటికప్పుడు ప్రాజెక్టును లేట్ చేయడం వల్ల అంచనా ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని, మరింత లేట్ చేస్తే ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2006లో రూ.128 కోట్ల అంచనా వ్యయం ఉంటే.. ఇప్పడది రూ.841 కోట్లకు పెరిగిందన్నారు. ఆలస్యమవుతుండడం వల్ల భూసేకరణ కూడా ఇబ్బంది అవుతున్నదని, భూముల ధరల్లో తేడాలు వస్తున్నాయని మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. అయితే, అందుకు పెండింగ్ లో ఉన్న రూ.196 కోట్లను తమకు చెల్లించాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. ఇప్పటికే12 ముంపు గ్రామాల్లో 7 గ్రామాలను తరలించామని, మరో 5 గ్రామాలను తరలించాల్సి ఉందని చెప్పారు. 

డిపాజిట్ కింద తెలంగాణ ఇచ్చే ఆ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. దానికి స్పందించిన ఈఎన్​సీ జనరల్.. ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని వారికి చెప్పారు. అయితే, అక్కడ క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తమ అధికారులను పంపిస్తామని, దానిపై పూర్తి రిపోర్టును తయారు చేస్తామని చెప్పారు. దానికి మహారాష్ట్ర సహకరించాలని కోరారు. సమావేశంలో ఈఎన్​సీ జనరల్​ రమేశ్ బాబు, జాయింట్ సెక్రటరీ(టెక్నికల్) కె. శ్రీనివాస్, కామారెడ్డి ఈఎన్​సీ తమటం శ్రీనివాస్, ఎస్ఈ విజయ్ కుమార్, మహారాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.  

90 శాతం పనులు పూర్తి.. 

లెండి ప్రాజెక్టును1986లో ప్రారంభించినా.. దశాబ్దాలపాటు ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ప్రాజెక్టు మొ త్తం మహారాష్ట్ర భూభాగంలోనే నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ వద్ద మంజీరా నదిపై నిర్మాణమవుతున్నది. రూ.45 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రాజెక్టుకు.. 2016 నాటికి ముప్పై ఏండ్లలో నాలుగు సార్లు అంచనాలను సవరించారు. 

చివరకు అంచనా వ్యయం రూ.2,183.88 కోట్లకు చేరింది. అందులో రూ.841 కోట్లు తెలంగాణ వాటా కాగా.. మిగతా మొత్తం మహారాష్ట్ర భరిస్తున్నది. ఇప్పటిదాకా ప్రాజెక్టులో 90% పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ ఎర్త్ డ్యామ్ 98% పూర్తవ్వగా.. గేట్లు, స్పిల్ వే పనులు 99% పూర్తయ్యాయి. భూసేకరణ జాప్యంతో కాల్వల పనులు  ఆలస్యమవుతున్నాయి. ప్రాజెక్టులో14 గేట్లకు 10 గేట్లనే అమర్చారు. 

మరో 3 గేట్లను పెట్టే ప్రక్రియ పూర్తయినా.. హోయిస్ట్​ల ఏర్పాటు పనులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కామన్ క్యారియర్​ కెనాల్​ను18.98 కిలోమీటర్ల పొడ వుతో నిర్మిస్తుండగా.. ఇప్పటికే15.9 కి.మీ. పూర్తయింది. భూసేకరణ కారణంగా 3.080 కి.మీ. పనులు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణకు పైప్​లైన్ ద్వారా వేస్తున్న 7.5 కి.మీ. రైట్ బ్యాంక్ కెనాల్ లో 7.1 కి.మీ. పూర్తయింది. రైట్ బ్యాంక్ కెనాల్​కు 1,075 ఎకరాల భూమి అవసరం కాగా.. 655 ఎకరాలను ఇప్పటికే సేకరించారు.