చిల్డ్రన్ సేఫ్టీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం! ‘క్లాప్ ఫర్ చిల్ర్డన్’ పోస్టర్ ఆవిష్కరణ

చిల్డ్రన్ సేఫ్టీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం! ‘క్లాప్ ఫర్ చిల్ర్డన్’ పోస్టర్ ఆవిష్కరణ
  • రాష్ట్ర సెక్రటేరియెట్​లో క్లాప్ ఫర్ చిల్ర్డన్ పోస్టర్ ఆవిష్కరణ
  •     యునిసెఫ్​తో కలిసి కార్యాచరణ ప్రకటించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, వెలుగు: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. యునిసెఫ్ తో కలిసి రూపొందించిన ‘క్లాప్ ఫర్ చిల్డ్రన్’ పోస్టర్ ను గురువారం సచివాలయంలో మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పిల్లల విషయంలో ఇతర సిటీలకు  ఆదర్శంగా ఉండేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు. 

ఈ ప్రయత్నంలో యునిసెఫ్ సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేస్తాయని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, ఆరోగ్యం, విద్య, కార్మిక శాఖలు,  జీహెచ్​ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఈవ్-టీజింగ్, బుల్లీయింగ్, పిల్లల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపడతాయని వెల్లడించారు. 

బాలల రక్షణ సెల్‌‌‌‌లు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యునిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డా. జెలాలెం బిర్హాను టాఫెస్సే తదితరులు పాల్గొన్నారు.