లిబియాను ముంచెత్తిన వరదలు.. 2వేలకు పైగా మృతి

లిబియాను ముంచెత్తిన వరదలు.. 2వేలకు పైగా మృతి

డ్యామ్​లు నిండి ప్రవహించిన వరద.. కూరుకుపోయిన జనం
కొట్టుకుపోయిన డెర్నా సిటీ
తుఫాన్ ధాటికి భారీ నష్టం

కైరో: లిబియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా 2వేల మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్నది. 10వేల మందికి పైగా గల్లంతయ్యారు. తూర్పు లిబియా తీవ్రంగా ప్రభావితమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగగా.. రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వందలాది డెడ్​బాడీలు బురదలో కూరుకుపోయాయని, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో తూర్పు లిబియాలోని చాలా నగరాలు ప్రభావితం అయ్యాయి. డెర్నా సిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వరదల తాకిడికి ఎగువన ఉన్న డ్యామ్‌‌లన్నీ ఉప్పొంగి డెర్నాను ముంచెత్తాయి. దీంతో నగరం పూర్తిగా ధ్వంసమైంది. కార్లు, బైక్​లు వరదలకు కొట్టుకుపోయాయి. 

రోడ్లపైనే మృతదేహాలు

డేనియెల్‌‌ తుఫాను ప్రభావంతో డెర్నా, జబల్‌‌ అల్ అఖ్దర్‌‌, అల్‌‌-మార్జ్‌‌ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత నగరాల్లోని రోడ్లపైనే డెడ్​బాడీలు పడి ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. ఒక్క డెర్నా సిటీలోనే 2వేలకు పైగా జనం చనిపోయి ఉంటారని మంత్రి అంచనా వేశారు. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 10 వేల మంది ఆచూకీ తెలియట్లేదని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్​క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ చెబుతున్నది.

వెయ్యికి పైగా డెడ్​బాడీలు వెలికితీత

వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సైన్యం, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి ఒకరు చెప్పారు. తీర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వరదల్లో మునిగిపోయాయని వివరించారు. సుమారు లక్ష మంది నివసించే డెర్నా సిటీలోనే వెయ్యికి పైగా మృతదేహాలను వెలికితీశారు. మిస్రాటా సిటీ కూడా వరద తాకిడికి గురైంది. రెండు అప్​స్ట్రీమ్ డ్యామ్​లు పగిలిపోవడంతో వరదలు ముంచెత్తి, వేలాది మంది ఆచూకీ గల్లంతైందని లిబియా ప్రధాని ఒస్సామా హమద్ తెలిపారు. పోయిన వారం గ్రీస్​ను కుదిపేసిన డేనియెల్ తుఫాన్.. ఆదివారం మెడిటరేనియన్ సముద్రాన్ని దాటింది. తీర ప్రాంతమైన డెర్నాను ముంచెత్తింది.