వికారాబాద్ హత్యకేసులో నిందితులకు జీవిత ఖైదు

వికారాబాద్ హత్యకేసులో నిందితులకు జీవిత ఖైదు

వికారాబాద్, వెలుగు: దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జరిమానా చెల్లించకపోతే  అదనంగా ఏడాది కఠిన కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించారు. 2012లో ధారూర్ మండలం నాగసముందర్ గ్రామంలో ఈ హత్య జరిగింది.  చౌట వెంకటేశం తన తల్లితో అక్రమ సంబంధం ఉందని చౌట మల్లేశంను హత్య చేసి జైలుకు వెళ్లాడు. 

దీంతో మల్లేశం బంధువులు వెంకటేశం కుటుంబంపై కక్ష్య పెంచుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 24న చిన్న నర్సిహులు, అంజమ్మ దంపతులపై బందెప్ప సహా ఆరుగురు గొడ్డళ్లు, కోడవళ్లతో దాడి చేసి చంపారు. ఆ సమయంలో అడ్డుకున్న వారి కూతురు బాలమణిపైనా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై ఎస్హెచ్ఓ రమేశ్ కేసు నమోదు చేయగా, ధారూర్ సీఐ లచ్చిరామ్, విజయ్ లాల్ విచారణ పూర్తి చేసి చార్జ్‌‌షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం  నిందితులకు జీవిత ఖైదు, బాలమణిపై హత్యాయత్నానికి 10 ఏళ్ల శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది.