మన ప్రాజెక్టులకు లైన్ క్లియర్...ఆ నాలుగు ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు.. అవి తొలగిపోయే చాన్స్

మన ప్రాజెక్టులకు లైన్ క్లియర్...ఆ నాలుగు ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు.. అవి తొలగిపోయే చాన్స్
  • ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సుప్రీం తీర్పు
  • పాలమూరు– రంగారెడ్డి, సీతమ్మసాగర్​, డిండి, గౌరవెల్లి పర్మిషన్ల విషయంలో సర్కారుకు ఊరట
  • రూ.974 కోట్ల ఫైన్‌‌పై సుప్రీంలో పిటిషన్లు వేయాల్సి ఉంటుందంటున్న నిపుణులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులకు లైన్​ క్లియర్​ అయింది.  సుప్రీంకోర్టు తీర్పుతో పర్యావరణ అనుమతులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతున్నాయి. 4  అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీ ఊరట లభించనుంది. ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని బుధవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్​ 3 ప్రకారం చట్టబద్ధమైన నోటిఫికేషన్​ ద్వారా పోస్ట్ ​ఫ్యాక్టో (రెట్రాస్పెక్టివ్​) పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్​ విపుల్​ పంచోలీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆఫీస్​ మెమో ద్వారా పోస్ట్​ ఫ్యాక్టో క్లియరెన్సులు ఇవ్వకూడదని తెలిపింది. కామన్​ కాజ్, అలెంబిక్​ ఫార్మాల విషయంలో నమోదైన కేసును విచారిస్తూ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.

ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ ఇంపాక్ట్​ అసెస్​మెంట్​ –2006 నోటిఫికేషన్​ ప్రకారం పోస్ట్​ ఫ్యాక్టో క్లియరెన్సులు ఇచ్చేందుకు స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్స్​ గుర్తించేలా 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆఫీస్​ మెమొరాండంను వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ 2025 మేలో సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా​ దాఖలు చేసింది. భవిష్యత్తులో ఎప్పుడూ పోస్ట్​ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వొద్దని జస్టిస్​ అభయ్​ ఎస్​ ఓకా, జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్‌‌‌‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 

కాగా, ఆ తీర్పును అదే ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో అప్పటి చీఫ్​ జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ కె. వినోద్​ చంద్రన్​, జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్‌‌‌‌తో కూడిన ధర్మాసనం కొట్టేసింది. మళ్లీ వాదనలు వింటామని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో సీజేఐ జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్​ బెంచ్​ ముందు విచారణకు వచ్చింది. వాదనలు విన్న సీజేఐ బెంచ్​.. చట్టబద్ధంగా నోటిఫికేషన్​ ఇచ్చి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని పేర్కొన్నది. 

ఈ తీర్పు ద్వారా మన రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాలమూరు –రంగారెడ్డి, సీతమ్మసాగర్ మల్టీపర్పస్​ ప్రాజెక్ట్​, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయా ప్రాజెక్టులపై వేసిన ఫైన్ల విషయంలోనూ కొంత ఊరట లభించే అవకాశాలున్నాయని అడ్వకేట్లు చెబుతున్నారు. 

డిండి, గౌరవెల్లిపైనా ఎన్జీటీలో కేసులు 

నల్గొండ, మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాల్లోని ఫ్లోరైడ్​ పీడిత ప్రాంతాలకు తాగునీటితోపాటు 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 6,190 కోట్ల వ్యయంతో డిండి పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో కృష్ణా జలాల కేటాయింపులు దెబ్బతింటాయని, పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీలో  ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 2022 డిసెంబర్‌‌‌‌లో ఎన్జీటీ ఈ ప్రాజెక్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రాజెక్టు వ్యయంలో 1.5%.. రూ. 92.85 కోట్ల ఫైన్​ వేసింది.  

ఇరిగేషన్​ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ షోకాజ్​ నోటీసులు కూడా జారీ చేసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద హుస్నాబాద్, స్టేషన్ ఘన్‌‌‌‌పూర్ నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎకరాలకు నీరందించే గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని రీ-ఇంజనీరింగ్ ద్వారా 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. 2003లో ఇచ్చిన పర్యావరణ అనుమతి గడువు 2008లోనే ముగిసిందని, సామర్థ్యం పెంచినందుకు కొత్తగా పర్యావరణ అనుమతి తీసుకోలేదని ముంపు గ్రామాల బాధితులు ఎన్జీటీని ఆశ్రయించారు. 

ఎన్జీటీ ఓ జాయింట్​ కమిటీని ఏర్పాటు చేయగా.. కొత్తగా అనుమతులు తీసుకోలేదని నివేదిక ఇచ్చింది. దీంతో.. కొత్తగా ఈసీ ప్రక్రియ ముగిసేవరకు గౌరవెల్లి రిజర్వాయర్‌‌‌‌లో నీటిని నింపవద్దని, పనులు కొనసాగించవద్దని ఎన్జీటీ స్టే ఇచ్చింది. గౌరవెల్లి పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయినా.. ఎన్జీటీ స్టే విధించడంతో నీళ్లు నింపడానికి లేకుండా పోయింది. 

‘సీతమ్మ’కూ ఎన్జీటీ కష్టాలే.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి నదిపై రూ. 3,481.90 కోట్ల అంచనా వ్యయంతో 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్​ను తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. కానీ, ఈ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ , అటవీ అనుమతులు లేవని, పబ్లిక్ హియరింగ్ జరపలేదని దెబ్బతిన్న గ్రామాల ప్రతినిధి ఒకరు ఎన్జీటీని ఆశ్రయించారు. 

దీంతో ఆ ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపేయాలని 2023 మార్చిలో ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకానికి వేరుగా, సీతమ్మ సాగర్ బ్యారేజ్‌‌‌‌కు ప్రత్యేకంగా ఎన్విరాన్‌‌‌‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌‌‌‌మెంట్ చేసి పర్యావరణ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ రూ. 53.41 కోట్ల జరిమానా వేసింది. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సవరించిన నివేదికలను సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ శాఖకు పంపింది.

పాలమూరు-రంగారెడ్డికి బిగ్ ​రిలీఫ్​ 

ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు 90 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 35,200 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం 2013లో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే, పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వం, కొందరు రైతులు నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్‌‌‌‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న ఎన్జీటీ.. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదని, పర్యావరణానికి డ్యామేజ్​ జరిగిందని పేర్కొంటూ ప్రాజెక్టు వ్యయంలో 1.5% చొప్పున రూ. 528 కోట్ల ఎన్విరాన్‌‌‌‌మెంటల్ కాంపెన్సేషన్ విధించింది. 

ఆ తర్వాత కూడా తమ ఆదేశాలను లెక్క చేయకుండా పనులు చేశారని చెబుతూ మరో రూ.300 కోట్లు మొత్తంగా రూ.828 కోట్ల ఫైన్​ వేసింది. ఆ మొత్తాన్ని కృష్ణా బోర్డు వద్ద జమ చేయాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరువు జిల్లా అయిన పాలమూరులో ప్రజలకు తాగునీటి అవసరాల కోసమే అత్యవసరంగా పనులు చేపట్టామని స్పష్టం చేసింది. దీంతో ఎన్జీటీ విధించిన జరిమానాలపై కోర్టు స్టే విధించింది. తాగునీటి కాంపొనెంట్​ పనులు చేసుకోవచ్చని సూచించింది. తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో మరింత ఊరట లభించనుంది. 

జరిమానాలూ పోతయా?

సుప్రీంకోర్టు తీర్పుతో ఈ నాలుగు ప్రాజెక్టులకు అనుమతులు క్లియర్​ కాబోతున్నాయి. ఎన్జీటీల్లో కేసులూ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఫైన్ల విషయంలోనే కొంత క్లారిటీ లేదు. ఎన్జీటీ వేసిన ఫైన్లను చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అన్ని ప్రాజెక్టులు కలిపి రూ.974 కోట్ల దాకా ఫైన్లు ఉన్నాయి. ఆ జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే సుప్రీంకోర్టులో మళ్లీ కొత్తగా వేర్వేరు పిటిషన్లను వేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.