సర్కారుకు లిక్కర్ కిక్కు..నెలకు సగటున రూ.2500 కోట్లు

సర్కారుకు లిక్కర్ కిక్కు..నెలకు  సగటున రూ.2500 కోట్లు
  • నెలకు సగటున రూ.2,500 కోట్లు 
  • ఆబ్కారీ నుంచి సర్కారుకు మస్తు ఆమ్దానీ
  • గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ. 74 కోట్లే..
  • ఈ సారి 10 నెలల్లోనే  రూ. 25 వేల కోట్ల మద్యం అమ్మకాలు
  • డిసెంబర్‌‌లో ఆల్‌‌టైం రికార్డు

ఈ ఆర్థిక సంవత్సంలో మరో ఆల్‌‌టైం రికార్డు నమోదైంది. ఒకే నెలలో ఎక్కువ మొత్తం సేల్స్‌‌ కొనసాగించిన నెలగా డిసెంబర్‌‌ నిలిచింది. ఆ నెలలో రూ. 2,765.5 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా అయింది. ఈ లెక్కన డిసెంబర్​లో ప్రతి రోజు సుమారు రూ. 92 కోట్ల దాకా లిక్కర్‌‌ అమ్మకాలు జరిగాయి. 2020 డిసెంబర్‌‌లో రూ. 2046.7 కోట్ల విలువైన మద్యం మాత్రం విక్రయించారు. 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్​ సేల్స్​ జోరుగా సాగుతున్నాయి. సర్కారుకు ఆబ్కారీ​ నుంచి మస్తు ఆమ్దానీ వస్తున్నది. స్టేట్​ వైడ్​గా సగటున రోజుకు 83 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడేండ్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈసారి ఆబ్కారీ శాఖ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శనివారం వరకు (పది నెలల్లో) ఏకంగా రూ. 25 వేల కోట్ల విలువైన లిక్కర్​ సేల్స్​ జరిగాయి. ఇందులో 3.04 కోట్ల ఐఎంఎల్ కేసులు, 2.68 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ. 22.3 వేల కోట్ల లిక్కర్ సేల్స్ మాత్రమే జరిగాయి. ఇందులో 2.74 కోట్ల ఐఎంఎల్ కేసులు, 2.2 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. 

ఈ ఏడాది 30 వేల కోట్ల ఆదాయం!

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులతోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. వీటికి మద్యం డిపోల నుంచి సరకు రవాణా అవుతుంది. అయితే ప్రస్తుతం సగటున నెలకు  రూ. 2,500 కోట్ల లిక్కర్​ అమ్ముడుపోతున్నది. ఇందులో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు రూ. 30 వేల కోట్ల ఆదాయం లిక్కర్​ ద్వారా వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు రూ. 83 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. కిందటేడాది ఇదే సమయానికి సగటున రోజూ  రూ.  74 కోట్ల సేల్స్ జరిగేవి. అంటే నిరుడితోపోలిస్తే ఒక రోజుకు రూ. 9 కోట్ల సేల్స్ పెరిగాయి. డిసెంబరు 31 లాంటి ప్రత్యేక సమయాల్లో ఒక్క రోజుకు రూ. 300 కోట్ల లిక్కర్  సేల్​ అయింది. ఈ జనవరిలో శనివారం వరకు రూ. 2,270 కోట్ల విలువైన లిక్కర్​ను డిపోల నుంచి తరలించారు. ఇందులో 28 లక్షల ఐఎంఎల్ కేసులు, 23 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. 

రాష్ట్రంలో జోరుగా లిక్కర్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నా.. ఇంకా సేల్స్​ పెరిగేలా సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఇటీవల కొత్తగా 404 వైన్స్‌‌‌‌‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. అంతకుముందు కొత్తగా 159 బార్లను నడిపేందుకు లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ పెంచాలని ఎప్పటికప్పుడు ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశాలు వెళ్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా బెల్ట్‌‌‌‌‌‌‌‌ షాపులు నడుస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. 

బీర్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం డౌన్‌‌‌‌‌‌‌‌..

సాధారణంగా ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే బీర్లనే ఎక్కువగా తాగుతారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రివర్స్​గా ఉంది. ఇటీవల బీర్ల అమ్మకాలు పడిపోయాయి. ఈ నెలలో 23 లక్షల బీరు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. చలి కాలం, దానికి తోడు కరోనా థర్డ్​ వేవ్​ వల్ల బీర్లను తాగేందుకు పెద్దగా ఇంట్రెస్ట్​ చూపడం లేదు. నిరుడు జనవరిలో మాత్రం 27 లక్షల కేసుల బీర్లు సేల్  అయ్యాయి. ఈ సారి బీర్​ సేల్స్ పడిపోవడంతో ఆ మధ్య వాటి ధరను ప్రభుత్వం రూ. 10 తగ్గించింది. తగ్గించిన కొత్తలో బీర్​ అమ్మకాలు ఊపందుకున్నా.. మళ్లీ తగ్గుముఖం పట్టాయి.

వైన్స్‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లతోనే సర్కారుకు రూ. 1,356 కోట్లు

మద్యం దుకాణాల లైసెన్స్ పీరియడ్ ముగియడంతో నిరుడు నవంబర్ లో కొత్త వాటి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్​ ఫీజు రూ. 2 లక్షలు. ఈ అప్లికేషన్ల ద్వారా రూ. 1,356 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రంగారెడ్డి జిల్లా నుంచి 8,224, ఖమ్మం జిల్లా నుంచి 6,212 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపుకు సగటున 61 అప్లికేషన్లు వచ్చాయి.  

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎక్కువ లిక్కర్ సేల్స్ జరిగిన జిల్లాలు ఇవే..


జిల్లా                               లిక్కర్​ సేల్స్ (రూ. కోట్లలో)​
రంగారెడ్డి                        5,700 
నల్గొండ                          2,700 
హైదరాబాద్                    2,630  
వరంగల్ అర్బన్            2,140  
మెదక్                             1,960
కరీంనగర్                       1,800