హరితప్లాజాలో జనగామ పంచాది.. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్

హరితప్లాజాలో జనగామ పంచాది.. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్
  • నేతలకు రూమ్స్ బుక్​ చేసిన ఎమ్మెల్సీ పల్లా? 
  • హోటల్​కు సడెన్​గా ఎంట్రీ ఇచ్చిన ముత్తిరెడ్డి


హైదరాబాద్/జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే టికెట్​పంచాయితీకి హైదరాబాద్​లోని హరితప్లాజా వేదికైంది. సిట్టింగ్​ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గానికి చెంది న లోకల్​ లీడర్లు బుధవారం హరితప్లాజాలో సమావేశమయ్యారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతి నిధులతో వాళ్లు మాట్లాడుతూ.. ‘‘మేం సెగ్మెంట్​లో మార్పు కోరుకుంటున్నం. మార్పుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం” అని చెప్పారు. అయితే ఈ మీటింగ్​ గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బుధవారం సాయంత్రం సడెన్​గా హరితప్లాజాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు సమావేశమయ్యారని లీడ ర్లను ప్రశ్నించారు. 

మంత్రి హరీశ్​రావు పిలిపిస్తేనే తాము హైదరాబాద్​కు వచ్చామని, అభివృద్ధి పనుల విషయం మాట్లాడేందుకు వచ్చామని ఆయనకు లీడర్లు చెప్పారు. తాము జనగామలో మార్పు కోరుకుంటున్నామనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఏమైనా ఉంటే ప్రగతి భవన్​లోనే తేల్చుకోవాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ముత్తిరెడ్డి ప్రగతి భవన్​కు వెళ్లారు. 

సమావేశమైన 100 మంది లీడర్లు.. 
నియోజకవర్గానికి చెందిన దాదాపు100 మంది బీఆర్ఎస్​ లీడర్లు బుధవారం బేగంపేటలోని హరితప్లాజాకు చేరుకున్నారు. జనగామ జెడ్పీ చైర్మన్‌‌, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌‌ రెడ్డి, మున్సిపల్​చైర్ పర్సన్ ​పోకల జమునా లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, ముఖ్య నాయకులు బండా యాదగిరి రెడ్డి, పెద్ది రాజిరెడ్డి, డాక్టర్​ సుగుణాకర్​ రాజు, అంకుగారి శ్రీధర్​తో పాటు పలువురు సర్పంచ్​లు, ఎంపీటీసీలు సమావేశమయ్యారు. 

వీరికోసం హోటల్​లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి రూమ్స్ బుక్​ చేశారని సమాచారం. అయితే, విషయం తెలుసుకు న్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి చేరుకోగా.. మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డితో పాటు మరికొందరు లీడర్లు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఈ సమావేశంపై జనగామ జెడ్పీ చైర్మన్ ​సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియాలో వస్తున్న వార్తలను చూసే తాను ఇక్కడికి వచ్చానన్నారు. హైకమాండ్ టికెట్​ఎవరికి ఇస్తే వారినే గెలిపిస్తామని, తాను ఎవరినీ సపోర్ట్​ చేయడం లేదన్నారు. 

జనగామ టికెట్​పై కేసీఆర్​దే తుది నిర్ణయమన్నారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి బదులుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఈసారి టికెట్​ఇవ్వాలనే డిమాండ్ ​లోకల్​ లీడర్ల నుంచి వస్తోంది. జెడ్పీ చైర్మన్​సంపత్ ​రెడ్డి.. నర్మెట జెడ్పీటీసీతో ఇటీవల మాట్లాడిన కాల్​రికార్డింగ్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దీనికి కొనసాగింపుగా ముత్తిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న లీడర్లందరూ హైదరాబాద్​లో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జనం నా వెంటే ఉన్నరు: ముత్తిరెడ్డి 
హరితప్లాజాకు వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా ముఖ్యమైన లీడర్లు లేరని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. నియోజకవర్గం నుంచి లీడర్లు హరితప్లాజాకు వచ్చారని తెలుసుకొనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, ఇక్కడికి కావాలని పిలిపించారని ఆరోపించారు. ‘‘పార్టీ హైకమాండ్ అన్నీ గమనిస్తోంది. కుట్రలను ఛేదిస్తుంది. అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలాధ్యక్షులు, లీడర్లు, జనం నా వెంటే ఉన్నారు” అని చెప్పారు. 

‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచాను. పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో నాకు ఫోన్​చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారు. జనగామ టికెట్​ విషయంలో గతంలోనే క్లారిటీ ఇచ్చారు. నిలబడేది.. గెలిచేది నేనే. హోటల్​లో ఇలాంటి సమావేశాలు పెడితే పార్టీ అధిష్టానం ఊరుకోదు” అని అన్నారు.