స్కూల్‌‌కు తాళం.. చెట్ల కింద పాఠాలు

స్కూల్‌‌కు తాళం.. చెట్ల కింద పాఠాలు

స్కూల్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో డబ్బులు ఇవ్వడం లేదని ఓ కాంట్రాక్టర్ పాఠశాలకు ఏకంగా తాళం వేశాడు. కాంట్రాక్టర్ చర్యపై అందరూ విస్తుపోయారు. స్కూల్ కొనసాగుతుండగానే ఇలా చేయడంతో విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చింది. చెట్ల కింద కూర్చొపెట్టి టీచర్లు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం తాను కాదని.. అధికారులేనంటూ ఆ కాంట్రాక్టర్ వెల్లడించాడు. తాను తాళం ఎందుకు వేయాల్సి వచ్చిందో కారణాలను మీడియాకు తెలిపాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్ లో చోటు చేసుకుంది. 

నెక్కొండ టౌన్ లో ప్రైమరీ స్కూల్ ఉంది. పాఠశాలలో రెండు అదనపు తరగతులతో పాటు, బాలికలకు, బాలురకు టాయిలెట్స్, ట్యాప్స్ ఏర్పాటు చేశారు. రూ. 20 లక్షలు వెచ్చింది స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తోట సాంబయ్య కాంట్రాక్టర్ తెలిపారు. అందులో రూ. 10 లక్షలు మాత్రమే తనకు చెల్లించి.. మిగతా డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో అధికారులకు తెలియచేసినా.. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. ఇలా నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూ.. అప్పులకు మిత్తీలు కడుతూ బతుకుతున్నట్లు వెల్లడించారు. అందుకే తాను ఇలా చేయడం జరిగిందన్నారు.