ఉద్ధవ్‎కు బిగ్ షాక్.. శిండే వర్గంలో శివసేన ఎంపీల విలీనానికి స్పీకర్ గ్రీన్ సిగ్నల్

ఉద్ధవ్‎కు బిగ్ షాక్.. శిండే వర్గంలో శివసేన ఎంపీల విలీనానికి స్పీకర్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. శివసేన యూబీటీకు చెందిన ఆరుగురు రెబెల్ ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పీకర్ ఆమోదంతో ఈ ఆరుగురు ఎంపీలు లోక్‌సభలో షిండే వర్గం సభ్యులుగా అధికారికంగా గుర్తింపు పొందినట్లు అయ్యింది. దీంతో లోక్‌సభలో షిండే వర్గం బలం 13కి చేరింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి లోక్‌సభలో తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. షిండే శివసేన కూడా ఎన్డీఏ కూటమిలో భాగం కావడం గమనార్హం. 

ఆరుగురు ఎంపీలు జంప్

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి  చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరిన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి లోక్ సభలో మొత్తం 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఆరుగురు షిండే వర్గంలోకి జంప్ అయ్యారు. తమను షిండే శివసేన వర్గంగా గుర్తించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను రెబల్ ఎంపీలు కోరారు. 

మరోవైపు.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తిరుగుబాటు ఎంపీలపై వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం స్పీకర్‎ను కోరింది. కానీ శివసేన యూబీటీ ఎంపీలు మూడింట రెండు వంతుల మంది చేరడంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. దీని ఆధారంగా ఉద్ధవ్ వర్గం రెబల్ ఎంపీలపై వేటు వేయకుండా.. వారిని షిండే వర్గం ఎంపీలుగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయంతో లోక్ సభలో ఉద్ధవ్ వర్గం ఎంపీల సంఖ్య మూడుకు పడిపోగా.. షిండే వర్గం బలం 13కు చేరింది.