ఉల్లి.. దేశమంతా లొల్లి

ఉల్లి.. దేశమంతా లొల్లి
  • సెంచరీ దాటేసిన రేటు.. కొన్ని చోట్ల కిలో రూ.130

గరం గరం బిర్యానీ ముద్దతో ఓ ఉల్లి ముక్క పడితే ఆ టేస్టే వేరు! పానీపూరీ నిండా రసంతో పాటు ఉల్లి ముక్కలేసుకు తింటే ఆ మజాయే వేరు! పెనం మీద కాలుతున్న దోశెపై ఓ పిడికెడు ఆనియన్​ ముక్కలను జల్లితే అబ్బో సూపర్​! ఓ నాలుగైదు ఉల్లిగడ్డలు కోసి గుడ్లు కొట్టి పోసి బుర్జీ చేసుకుంటే ఆ పూటకు కూర అయిపోయినట్టే! ఒక్కటేమిటి.. ఉల్లి లేని వంటే లేదు! అంతలా జనంతో ఉల్లి బంధం అల్లుకుపోయింది. కానీ, ఇప్పుడు పట్టుకోవాలంటేనే ఉల్లి భయపెట్టిస్తోంది. కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఉల్లి రేటు సెంచరీ దాటేసింది.కొన్ని చోట్ల కిలోనే ఇస్తామంటూ రేషన్​ కూడా పెడుతున్నారు. ఒక్కటి కాదు, ఇప్పుడు ఉల్లి వెనక ఎన్నెన్నో స్టోరీలు నడుస్తున్నాయి.


ఉల్లి దొంగతనాలు

ఉల్లి రేట్లు భారీగా పెరుగుతుండడంతో దొంగల కన్ను ఉల్లిపై పడినట్టుంది. షాపులు, గోదాముల్లో మిగతా సరుకులను వదిలేసి ఉల్లినే ఎత్తుకెళ్లిపోతున్నారు. పశ్చిమబెంగాల్​లోని సుతహతలో ఉన్న ఓ షాపులో దొంగలు ఉల్లిని దోచుకెళ్లిపోయారు. ఆ ఉల్లి విలువ 50 వేలకు పైనే ఉంటుందని షాపు ఓనర్​ అక్షయ్​ దాస్​ చెప్పారు. సోమవారం రాత్రి ఈ దొంగతనం జరిగిందని తెలిపారు. అయితే, ఉల్లి బస్తాలు ఎత్తికెళ్లిపోయిన దొంగలు క్యాష్​ కౌంటర్​లోని డబ్బును మాత్రం ముట్టుకోలేదు. ఉల్లితో పాటు అల్లంఎల్లిగడ్డను దోచుకుపోయారు. ఇటు గుజరాత్​లోనూ దొంగలు ఉల్లినే టార్గెట్​ చేశారు. బుధవారం అర్ధరాత్రి పాలంపూర్​ పాటియాలోని ఓ షాపులో రూ.25 వేల విలువైన ఐదు బస్తాల ఉల్లిని దొంగిలించారు. ఈ ఏడాది సెప్టెంబర్​లోనూ బీహార్​లో భారీ ఉల్లి దొంగతనం జరిగింది. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలోని ఫతుహాలో ఉన్న సోనారు కాలనీ గోదాము నుంచి 8 లక్షల విలువైన ఉల్లిగడ్డలను దోచుకెళ్లారు దొంగలు.

రెస్టారెంట్లలో ఉల్లిగడ్డ బంద్​

బయట మిర్చి బజ్జీలు, పానీపూరి తినేటప్పుడు, ‘భయ్యా తోడా ప్యాస్​ దాలో’ అని అడుగుతాం. రెస్టారెంట్​కు వెళితే ఫుడ్డుతో పాటు ఉల్లిగడ్డ ముక్కలు పెట్టడం కామన్​. కానీ, ఇప్పుడు అడిగినా పెట్టే పరిస్థితి లేదు. కొన్ని రెస్టారెంట్లలో ఇప్పటికే ఉల్లిగడ్డను బంద్​పెట్టారు. అడిగితే, రేట్లు ఎక్కువున్నాయండీ అంటున్నారు. తమిళనాడులోని చాలా వరకు రెస్టారెంట్లు, అసలు ఉల్లి లేకుండానే వంటలు చేసేస్తున్నాయి. మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు చాలా వరకు ఉల్లి వాడకాన్ని తగ్గించాయి.

లిమిట్​ దాటొద్దు

పెరుగుతున్న ఉల్లి రేట్లను కంట్రోల్​ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​లో ఉల్లి వ్యాపారులకు లిమిట్​ పెట్టింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్​సేల్​ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి స్టాక్​ పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ లిమిట్​నే నిరవధికంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఆదేశాలొచ్చే దాకా వ్యాపారులెవరూ అంతకుమించి స్టాక్​ను పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ లెటర్​ కూడా రాశారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వారానికోసారి రిపోర్ట్​ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎవరైనా లిమిట్​కు మించి స్టాక్​ పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

నాసిక్​లో ఐటీ రెయిడ్స్​

లిమిట్​కు మించి ఉల్లిని స్టాక్​ పెట్టుకుంటున్నారన్న ఫిర్యాదులతో ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు హోల్​సేల్​ షాపులు, వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో 15 చోట్ల ఐటీ అధికారులు బుధవారం రాత్రి దాడులు చేశారు. సతానా, కల్వాన్​, నాసిక్​, పింపల్​గావ్​, లసల్గావ్​లలోని కొన్ని హోల్​సేల్​ మార్కెట్లలో తనిఖీలు చేశారు. ఆయా షాపుల రికార్డులను పరిశీలించారు. ఇక, వారం రోజుల క్రితం నేపాల్​కు అక్రమంగా తరలిస్తున్న 5 కోట్ల రూపాయల విలువైన 200 టన్నుల ఉల్లిగడ్డలను బీహార్​లోని రషౌల్​లో అధికారులు పట్టుకున్నారు.

ఏటా ఎందుకీ సమస్యలు?

ప్రతి వెయ్యిలో 908 మంది ఉల్లిగడ్డలు వాడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ, దేశంలో ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నది కొన్ని రాష్ట్రాలే. ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉల్లి పండుతుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్​, కర్ణాటక, బీహార్​, రాజస్థాన్​లో ఉల్లి పండుతోంది. ఈ ఏడాది ఎక్కువగా మహారాష్ట్ర నుంచి 36 శాతం, మధ్యప్రదేశ్​ నుంచి 16 శాతం, కర్ణాటక నుంచి 13 శాతం, బీహార్​ నుంచి 6, రాజస్థాన్​ నుంచి 5 శాతం చొప్పున ఉల్లిగడ్డ సరఫరా అయింది. రోజువారీ ధరలు దేశంలోని పది పెద్ద మార్కెట్లలోనే డిసైడ్​ అవుతుంటాయి. అందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే ఆరున్నాయి. కొందరు చిన్న, పెద్ద వ్యాపారులు కలిసి ఉల్లి ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో ఉల్లి రేటు పెరుగుతోంది. అయితే, రేటు అంత పలుకుతున్నా రైతులు బాగుపడుతున్నారా అంటే అదీ లేదు. వాళ్ల దగ్గర అతి తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక, ఎక్కడికక్కడ బఫర్​ స్టాక్​ పెరిగిపోతుండడంతో గోదాముల్లోనే చాలా వరకు ఉల్లిగడ్డలు పాడైపోతున్నాయి. గత ఏడాది 13 వేల టన్నుల నిల్వల్లో 6,500 టన్నుల వరకు ఉల్లి కుళ్లిపోయింది. టైంకు వర్షాలు పడక పంట వేయడం ఆలస్యమవడం, చేతికొచ్చిన పంట అకాల వర్షాలకు నాశనమవడమూ డిమాండ్​కు తగ్గ ఉల్లి లేకపోవడానికి కారణమైంది.  ఫలితంగా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.

32,500 క్వింటాళ్లు కుళ్లాయ్‌‌

ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల ఉల్లి రేటు సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్ల అయితే, దాన్ని దాటేసిపోయింది. కోల్​కతా, చెన్నై, ముంబై, పుణే. ఒడిశాల్లో కిలో ఉల్లి 120 రూపాయల నుంచి 130 రూపాయల దాకా ఉంది. అయితే, ఓవైపు రేట్లు అంత మండిపోతున్నా ప్రభుత్వ గోదాముల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ గోదాముల్లో 32,500 క్వింటాళ్ల ఆనియన్​ స్టాక్​ కుళ్లిపోయిందని కేంద్ర ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్​ పాశ్వాన్​ ప్రకటించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఓవైపు పెరుగుతున్న రేట్లతో జనం ఉల్లిని కొనే పరిస్థితుల్లో లేకుంటే, గోదాముల్లో అవి కుళ్లిపోయే దాకా ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. గత ఏడాదీ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక్క బీహార్​ రాజధాని పాట్నాలోనే దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఉల్లి గోదాముల్లో కుళ్లిపోయింది.

ఈజిప్ట్​ నుంచి తెప్పిస్తున్నరు

కొన్ని రోజుల క్రితం దాకా మన దగ్గరి నుంచే బయటి దేశాలకు ఉల్లి ఎక్కువగా పంపించేటోళ్లం. కానీ, కాలం, వర్షం కారణమేదైతేనేం, దిగుబడి తగ్గి ఎగుమతులను నిషేధించింది కేంద్రం. మన దగ్గర పండిన ఉల్లి మనకే సరిపోవట్లేదు. దీంతో బయటి దేశాలకు ఎగుమతి చేసిన మనమే, అదే బయటి దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్​కు తగ్గట్టు సరఫరా చేసేందుకు ఈజిప్టు నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 6,090 టన్నుల ఈజిప్టు ఉల్లిగడ్డలు డిసెంబర్​ ప్రారంభం నాటికి ముంబై మార్కెట్లకు చేరతాయని ప్రభుత్వ రంగ ట్రేడింగ్​ సంస్థ అయిన ఎంఎంటీసీ తెలిపింది. రాష్ట్రాలకు 50 నుంచి 60 రూపాయల దాకా డిస్ట్రిబ్యూషన్​ రేటుతో సరఫరా చేయాలని నిర్ణయించింది. నాఫెడ్​ లేదా డైరెక్ట్​గానైనా రాష్ట్రాలు తీసుకెళ్లొచ్చని చెప్పింది. పెరుగుతున్న రేట్లను కట్టడి చేయడం, డిమాండ్​కు తగ్గ సరఫరా చేయడం కోసం 1.2 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవాలని కేంద్ర కేబినెట్​ గత వారమే నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈజిప్టు నుంచి తెప్పిస్తోంది. ఒక్క ఈజిప్టే​ కాదు, ఆఫ్గనిస్థాన్​, టర్కీ, ఇరాన్​లకూ ఉల్లి దిగుమతులపై ఇండియా రిక్వెస్ట్​ పెట్టింది. కొద్ది రోజుల్లో ఆయా దేశాల నుంచీ ఉల్లిగడ్డ వచ్చే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి