ప్రేమ పేరిట వేధింపులు.. మెడికో సూసైడ్.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ఘటన

ప్రేమ పేరిట వేధింపులు.. మెడికో సూసైడ్.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ఘటన
  • భయంతో యువకుడు కూడా ఆత్మహత్య

కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు: ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతి విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో జరిగింది. 

శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్‌‌‌‌ఐ రవీందర్, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన సుక్క లింగయ్య–యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీప్రసన్న(21) సూర్యాపేట మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్​ చదువుతోంది. రెండు నెలలుగా స్వగ్రామం నుంచి కాలేజీకి అప్​ అండ్​ డౌన్​ చేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన చిలుముల రాంచరణ్ (25) కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఈ నెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న మృతి విషయం తెలుసుకున్న రాంచరణ్ భయాందోళనకు గురై, తన వ్యవసాయ బావి వద్ద ఉన్న తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మహత్యకు ముందు తన తండ్రి సమాధిపై రక్తంతో కొన్ని పదాలు రాసినట్లు సమాచారం. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీ ప్రసన్న మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో, రాంచరణ్ మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.