- యువకులకు గాలం .. పోలీసులకు సవాల్
నల్గొండ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరుస చోరీలతో పోలీసులకు సవాల్‌గా మారిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు నడిపిస్తున్న ముఠాలోని ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.53 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం వెల్లడించారు.
ఈ నెల 1న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భూష్మి శ్రీకాంత్‌ను నల్గొండ సీసీఎస్, మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ, గుంటూరు, నల్గొండ ప్రాంతాల్లోని వైన్ షాపుల వద్ద యువకులను లక్ష్యంగా చేసుకుని వారికి మద్యం తాగించి, స్నేహం పెంచుకుని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపిస్తూ చోరీలకు ప్రేరేపించేవాడని తెలిపారు.
గుంటూరులో సభ్యులకు దొంగతనాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు విచారణలో తేలింది. గ్యాంగ్‌లో తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన వారందరికీ గతంలో నేరచరిత్ర లేదని, నాగరాజు జైలులో శ్రీకాంత్‌తో పరిచయం కావడంతో ఈ ముఠాలో చేరినట్లు పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందాలు ఏపీలోని పిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి, అమరావతి పరిసరాల్లో తమ్మిశెట్టి నాగరాజు, అల్లంశెట్టి సాయికిరణ్, సమంతపు వెంకట అశోక్, ఆలేటి కోటేశ్వరరావు, సపావత్ నాగకిరణ్ బాబు, పిల్లి రాజేష్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు గాడిబోయిన గోపి సాయి, తమ్మండ్ర రమేశ్ పరారీలో ఉన్నారని తెలిపారు.
రూ.53 లక్షల సొత్తు రికవరీ..
ఈ ముఠా తెలంగాణలో 28, ఏపీలో 12 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు, ఐదు బైకులు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్లు, ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.53 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎం.జితేందర్ రెడ్డి, డి.చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సీఐ ప్రసాద్‌తో పాటు పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
