మెదక్: గ్యాస్ బుకింగ్ చేసినా లభించకపోవడంతో ఆగ్రహానికి గురై.. గ్రామంలోకి వచ్చిన గ్యాస్ సిలిండర్ ఆటో నుంచి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సిలిండర్లు తీసుకెళ్లిపోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలో గ్యాస్ కష్టాలతో గ్రామస్తులు సతమతమవుతున్నారు. వాహనంలో డెలివరీకి 40 సిలిండర్లతో వచ్చిన ఆటోలో నుంచి గ్యా్స్ లాక్కున్న దృశ్యాలు గ్రామస్తుల గ్యాస్ కష్టాలను కళ్లకు కట్టాయి.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో గత కొంతకాలంగా గ్యాస్ బుక్ చేసిన లభించలేదంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. మంగళవారం శివ్వంపేట చెందిన వెంకటరమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆటో గ్యాస్ డెలివరీ రావడంతో గ్యాస్ సిలిండర్ల కోసం ఎగబడిన గ్రామస్తులు సిలిండర్లను లాక్కెళ్లిపోయారు.
గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు కొన్ని గ్రామాల్లో ఆందోళనకరంగా ఉన్నాయి. గ్యాస్ కొరత లేదని, కేవలం సరఫరాలో జాప్యం జరుగుతోందని డీలర్లు చెబుతున్నప్పటికీ, ప్రజలు అభద్రతా భావంతో అవసరం లేకపోయినా ముందస్తు బుకింగ్లు చేస్తుండటం కూడా గ్రామాల్లో గ్యాస్ కొరతకు కారణమవుతుంది. మరోవైపు గ్యాస్ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
పర్యవేక్షణ లోపించడంతో సామాన్య వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ పక్కదారి పడుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో చాలాచోట్ల డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు మళ్లిస్తున్నారు. కొందరు డీలర్లు డెలివరీ బాయ్స్ ద్వారా గ్యాస్‌ను బ్లాక్లో విక్రయించడం, గృహ అవసరాల సిలిండర్ల నుంచి గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపడం వంటి పనులు చేస్తు్ండటం కూడా గ్యాస్ కష్టాలకు కారణం.

