ఈయూ డీల్‌తో కార్ల రేట్లు సగానికి తగ్గుతాయా..? బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, వోక్స్‌వ్యాగన్ రేట్లు ఎంత తగ్గొచ్చు?

ఈయూ డీల్‌తో కార్ల రేట్లు సగానికి తగ్గుతాయా..? బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, వోక్స్‌వ్యాగన్ రేట్లు ఎంత తగ్గొచ్చు?

సాధారణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై భారత్ ఇప్పటివరకు 110 శాతం నుంచి 170 శాతం వరకు పన్నులు వసూలు చేస్తోంది ఇండియా. అంటే రూ. కోటి విలువైన కారు ఇండియాకు వచ్చేసరికి పన్నులతో కలిపి దాని రేటు దాదాపుగా రూ.3 కోట్లు అయ్యేది. కానీ తాజా యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ప్రస్తుతం ఉన్న భారీ సుంకాలను దశలవారీగా 10 శాతానికి తగ్గించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే దీనికోసం ఒక కోటా వ్యవస్థను కూడా ప్రకటించాయి. దీంతో లగ్జరీ జర్మన్ కార్ కొనాలనుకునే వారికి పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. 

పన్నుల తగ్గింపు ఎలా ఉండబోతోంది?

* మొదటి దశలో దిగుమతి సుంకాలు నేరుగా 40 శాతానికి తగ్గుతాయి. దీనివల్ల కారు ధరపై పడే మొత్తం పన్ను భారం 70-90 శాతానికి పరిమితం అవుతుంది. ఫలితంగా కారు ధరలు ఇప్పుడున్న రేట్ల కంటే 40 నుండి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే కోటి రూపాయులకి అమ్ముడవుతున్న కారు సగం రేటుకే అందుబాటులోకి వస్తుంది.
* రెండో దశలో భాగంగా రాబోయే కొన్నేళ్లలో దిగుమతి సుంకాన్ని ఏకంగా 10 శాతానికి తగ్గించనున్నారు. ఇంత తక్కువ పన్ను రేటును భారత్ ఏ ఇతర దేశానికి కూడా ఇప్పటివరకు ఆఫర్ చేయలేదు.
* ఇక మూడో దశలో స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే వాటిపై కూడా వచ్చే 5 నుండి 10 ఏళ్లలో పన్నులను పూర్తిగా రద్దు చేయనున్నారు. ఇది స్థానికంగా కార్లను అసెంబుల్ చేసే కంపెనీలకు పెద్ద ఊరటని చెప్పొచ్చు.

డీల్ కారణంగా ఏయే కార్ల రేట్లు తగ్గుతాయి?

ఈ పన్ను తగ్గింపు ప్రయోజనం ఏటా గరిష్టంగా రెండు లక్షల కార్ల వరకు వర్తిస్తుంది. ప్రస్తుతం కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే ఈ రాయితీని భారత్ ఆఫర్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలను మొదటి 5 ఏళ్ల వరకు ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ప్రధానంగా యూరప్‌కు చెందిన మెర్సిడెస్ బెంచ్, BMW, ఆడి, పోర్షే, లంబోర్గిని, ఫెరారీ, బెంట్లీ, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, వోల్వో, వోక్స్‌వ్యాగన్, స్కోడా వంటి బ్రాండ్ల కార్లు తాజా ట్రేడ్ డీల్ వల్ల తగ్గుతాయి. ఇది లగ్జరీ కార్ కొనాలనుకునే భారతీయులకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టనుంది. 

ఇంతకీ కస్టమర్లకు పూర్తి లాభం దక్కుతుందా..?

పన్నులు తగ్గినంత మాత్రాన కార్ల కంపెనీలు వెంటనే ధరలను తగ్గిస్తాయా? అంటే అది పూర్తిగా ఆయా సంస్థల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఇబ్బందులు, కరెన్సీ విలువలో మార్పులు..  డిమాండ్‌ను బట్టి కంపెనీలు ధరలను నిర్ణయిస్తాయి. అయినప్పటికీ పన్ను తగ్గింపు చాలా భారీగా ఉండటంతో పోటీని తట్టుకోవడానికి కంపెనీలు కార్ల ధరలను తగ్గించడం అనివార్యం కానుందని ఆటో నిపుణులు అంటున్నారు.

మెుత్తానికి రెండు దశాబ్ధాల చర్చల తర్వాత భారత్ యూరోపియన్ దేశాల మధ్య జరిగిన ఒప్పందం భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పులకు కారణం కాబోతోంది. లగ్జరీ కార్లు సామాన్యులకు అందుబాటులోకి రాకపోయినా.. ధనవంతులకు, కార్ల ప్రియులకు మాత్రం ఇది గొప్ప అవకాశమే. విదేశీ బ్రాండ్లు ఇండియాలో మరింత వేగంగా తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి ఈ ఒప్పందం పెద్ద అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు.