
మకావు: మకావు ఓపెన్ సూపర్–300 టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో రెండోసీడ్ లక్ష్యసేన్ 16–21, 9–21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు. ఈ సీజన్‌లో ఫామ్, ఫిట్‌నెస్‌తో ఇబ్బందిపడుతున్న లక్ష్య 39 నిమిషాల మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఏడుసార్లు తొలి రౌండ్‌లో వెనుదిరిగిన లక్ష్యసేన్.. రెండుసార్లు రెండో రౌండ్‌కు పరిమితమయ్యాడు.
మరో సెమీస్‌లో తరుణ్ మన్నేపల్లి 21–19, 16–21, 16–21తో జస్టిన్ హోహ్ (మలేసియా) చేతిలో కంగుతిన్నాడు. గంటా 21 నిమిషాల మ్యాచ్‌లో తరుణ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి గేమ్‌లో 17–12తో దూసుకుపోయిన తరుణ్‌ను జస్టిన్ 18–18తో సమం చేశాడు. వెంటనే మూడు రిటర్న్స్‌తో గేమ్‌ను సాధించాడు. కానీ తర్వాతి రెండో గేమ్‌లో 13–13తో స్కోరు సమమైన తర్వాత ఇండియన్ ప్లేయర్ పుంజుకోలేకపోయాడు. 6–3తో డిసైడర్‌ను మొదలుపెట్టిన తరుణ్.. జస్టిన్ షాట్లకు బదులివ్వలేక 13–16తో వెనకబడి కోలుకోలేకపోయాడు.