దవాఖానలోని కోట్ల విలువైన యంత్రాలు నీటిపాలు

దవాఖానలోని కోట్ల విలువైన  యంత్రాలు నీటిపాలు
  • మంచిర్యాల దవాఖానలో 2 ఫ్లోర్లు నీటిలోనే
  • ప్రారంభించిన నెలకే జలమయమైన మంథని సీహెచ్‌‌సీ
  • శిథిలావస్థలో మరో వంద దవాఖాన్లు
  • ఎప్పుడు కూలుతయోనని ఆందోళనలో డాక్టర్లు, సిబ్బంది

హైదరాబాద్, నెట్‌‌వర్క్, వెలుగు:  రాష్ట్రంలో భారీ వానలు, వరదల ఎఫెక్ట్ సర్కార్ దవాఖాన్లపై పడింది. మంచిర్యాల జిల్లా కేంద్రం, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో కట్టిన మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు (ఎంసీహెచ్‌‌) పూర్తిగా నీట మునిగాయి. పోటెత్తిన గోదావరి వరదలతో రెండు దవాఖాన్లు జలమయమయ్యాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలను ఇక్కడి నుంచి ముందుగానే తరలించడంతో భారీ ముప్పు తప్పింది. మంచిర్యాల దవాఖానలో 3 ఫ్లోర్లు ఉంటే, అందులో 2 ఫ్లోర్లు నీట మునిగాయి. దీంతో రూ.కోట్ల విలువైన యంత్రాలు, సామగ్రి తడిసిపోయాయి. ఈసీజీ, ఎక్స్‌‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి మెషీన్లు ఇక పనిచేయకపోవచ్చని బయోమెడికల్ ఇంజనీర్లు చెబుతున్నారు. 

గోదావరి, బొక్కల వాగు ఉప్పొంగడంతో ..

బెడ్లు, పరుపులు ఉన్నయో, కొట్టుకుపోయినయో తెలియని పరిస్థితి.  మంథని సీహెచ్‌‌సీని గత నెల 21న మంత్రి హరీశ్‌‌రావు ప్రారంభించారు. భూపాలపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఈ బిల్డింగ్ నిర్మించారు. రోడ్డు కంటే ఎత్తులో నిర్మించాల్సిన బిల్డింగ్‌‌ను నాలుగైదు ఫీట్ల కిందికి కట్టారు. దీంతో చిన్న వానకే  నీళ్లన్నీ ఈ బిల్డింగ్‌‌లోకే వచ్చేలా పరిస్థితి ఉంది. తాజా వానలకు గోదావరి, బొక్కల వాగు ఉప్పొంగడంతో ఏకంగా బిల్డింగ్ మొత్తం మునిగిపోయింది. ప్రస్తుతం కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ దవాఖాన్లను ఊర్లకు చివర పొలాల్లో నిర్మిస్తున్నారు. ఇలా కట్టేటప్పుడు బరంతి ఎత్తు పోసి నిర్మాణాలు చేపట్టాలి. కానీ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై లోతట్టుగా నిర్మాణాలు చేపడుతుండడంతో భవిష్యత్తులో ఇలాంటి వానలు, వరదలు వచ్చినప్పుడు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెల్త్ ఆఫీసర్లే చెబుతున్నారు.

2 నెలల క్రితమే రిపేర్లు చేయించినా..

ఇక హైదరాబాద్‌‌లోని ఉస్మానియా దవాఖాన ఓపీ బిల్డింగులో 4 రోజుల క్రితం సీలింగ్ కూలింది. 2 నెలల క్రితమే రూ.కోటి వ్యయంతో రిపేర్లు చేయించినా ఫలితం లేదు. అయితే ఉస్మానియాలోని చాలా చోట్ల బిల్డింగ్ నుంచి నీళ్లు కారుతున్నాయి.ఇలా రాష్ట్రంలో  ఏకంగా వంద దవాఖాన్లు కూలిపోయేలా ప్రమాదకర పరిస్థితిలోకి వచ్చాయి. ఇందులో 60 బిల్డింగులను కూల్చడమే తప్ప రిపేర్లకు పనికిరావని, ఇంకో 40 బిల్డింగులను రిపేర్ చేయిస్తే నెట్టుకురావచ్చని అధికారులు గుర్తించారు. ఇందులో ఎక్కువగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లే ఉన్నాయి. ఈ బిల్డింగుల్లో భయపడుతూనే డాక్టర్లు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బిల్డింగుల మార్పు కోసం జిల్లా అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కనీస స్పందన ఉండడం లేదని పలువురు మెడికల్ ఆఫీసర్లు ‘వెలుగు’కు తెలిపారు.

రంగులు వేసి నెట్టుకొస్తున్నరు

బిల్డింగులు శిథిలావస్థకు చేరినా, వాటికే రంగులు వేయించి మేనేజ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 21 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉంటే, అందులో 6 పీహెచ్‌‌సీలు (బషీర్‌‌‌‌బాద్‌‌, దోమ, మోమిన్‌‌పేట్, నవాబ్‌‌పేట్‌‌, పెద్దెముల్‌‌, పూడూరు) కూలిపోయే స్థితిలోనే ఉన్నాయని ఆ జిల్లా ఆఫీసర్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలోని దౌల్తాబాద్‌‌ సీహెచ్‌‌సీ, సర్గాపూర్‌‌‌‌, హత్నూర, ఇన్నారం, నిజాంపేట్ పీహెచ్‌‌సీలు కూడా కూలిపోయే స్థితికి చేరాయని ఆ జిల్లా ఆఫీసర్ ఒకరు వెలుగుకు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని కొలనూరు, మైదారం, కమాన్‌‌పూర్, కాల్వశ్రీరాంపూర్ పీహెచ్‌‌సీలది కూడా ఇదే పరిస్థితి. తమ జిల్లాలోని వంగూరు, తెల్కపల్లి, పాలెం, లింగాల పీహెచ్‌‌సీలు శిథిలావస్థకు చేరాయని, ఇలా మొత్తం 60 దవాఖాన్ల కొత్త బిల్డింగుల కోసం సర్కార్‌‌‌‌కు విజ్ఞప్తులు వచ్చినట్టు తెలిసింది. కానీ వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు.

పిల్లలపై పడితే!

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సీహెచ్‌‌సీ బిల్డింగ్‌‌ను 50 ఏండ్ల కింద నిర్మించారు. బిల్డింగ్ పాతబడటంతో వర్షాలు వచ్చినప్పుడు పెచ్చులూడుతున్నాయి. 30 బెడ్ల ఈ దవాఖానకు రోజూ 200 మంది పేషెంట్లు వస్తుంటారు. ప్రతి నెల 30 డెలివరీలు జరుగుతున్నాయి. ఇంత రద్దీ ఉండే హాస్పిటల్‌‌లో పెచ్చులూడే స్థితి ఉండడంతోఎప్పుడు ఎవరి మీద పడుతాయోనని డెలివరీ కోసం వచ్చే గర్భిణులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలమీద పెచ్చులూడి పడితే ఎలా అని కాస్త బెటర్​గా ఉన్న ఏరియాను ప్రసూతి వార్డుగా మార్చారు. ఇప్పుడు అన్ని పీహెచ్‌‌సీలు, సీహెచ్‌‌సీలలో ప్రసవాలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి కూలిపోయే పరిస్థితిలో ఉన్న దవాఖాన్లలో ప్రసూతి చేసేదెట్లా అని అక్కడి డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.