తిరుమలలో మధ్యప్రదేశ్ మంత్రి హల్ చల్.. శ్రీవారి ఆలయం ముందే నలుగురితో ఫొటో షూట్

తిరుమలలో మధ్యప్రదేశ్ మంత్రి హల్ చల్.. శ్రీవారి ఆలయం ముందే నలుగురితో ఫొటో షూట్

తిరుమల: కలియుగ దైవం శ్రీవారి ఆలయంలో మధ్యప్రదేశ్‎కు చెందిన మంత్రి ప్రహల్లాద్ సింగ్ పటేల్ హల్ చల్ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయ పరిసరాలలో నలుగురు ఫోటో, వీడియో గ్రాఫర్లతో ఫోటో షూట్ నిర్వహించారు. టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి సమక్షంలోనే ఈ ఫొటో షూట్ జరగడం గమనార్హం. ఈ ఘటనపై భక్తులు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు, అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, ఫొటో షూట్స్ నిర్వహించడంపై టీటీడీ నిషేధం విధించింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా మధ్యప్రదేశ్‎కు చెందిన మంత్రి ఏకంగా నలుగురు ఫొటో గ్రాఫర్లతో శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సమక్షంలో‎నే ఫోటో షూట్ జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

టీటీడీ బోర్డు మెంబర్ అయ్యిండి నిబంధనలకు విరుద్ధంగా ఫొటో షూట్ చేస్తుంటే అడ్డుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు స్వామి వారి సన్నిదిలో గుర్తుగా ఫోటో తీసుకోవడం వరకు ఎవ్వరికి అభ్యంతరం లేదని.. కానీ ఒకే సారి నలుగురు ఫోటో గ్రాఫర్లతో ఫోటో షూట్ చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవిత్ర ఆలయంలో కూడా సామాన్యులకు ఒక రూల్.. వీఐపీలకు ఒక రూలా అంటూ టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.