- నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం
- హిజాబ్ తో పరీక్షకు రావడంపై నిషేధం లేదు
- కాలేజీపై తప్పకుండా చర్యలు తీసుకుంటం
- మహిళల వస్త్రధారణపై హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: మహిళలు వస్త్రధారణపై హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. ఐఎస్ సదన్ లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి పరీక్షకు రావడం.. సిబ్బంది హిజాబ్ తీసేస్తేనే లోనికి అనుమతించడంపై స్పందించిన మహమూద్ అలీ 'మహిళలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. కానీ యూరోపియన్ల తరహాలో కురుచ బట్టలు వేసుకోవద్దు. అలా వేసుకొనే మహిళలు ఇబ్బందుల పాలవుతారు. నిండుగా బట్టలు వేసుకుంటే రిలాక్స్ డ్ గా ఉండొచ్చు. సంప్రదాయ ముస్లింలైతే హిజాబ్, హిందువులు తలపై పల్లు(కొంగు) ధరించవచ్చు. ఇలాంటి వస్త్రధారణతో గౌరవం పెరుగుతుంది.’అంటూ వ్యాఖ్యనించారు. హిజాబ్ ధరించి పరీక్షకు వచ్చిన మహిళలను అనుమతించకపోవడంపై తాను కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతానని, సదరు కాలేజీపై తప్పక చర్యలు తీసుకుంటామని హోం మంత్రి చెప్పారు.
అసలు కారణం ఇది..
హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో ని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియం విద్యార్థులు డిగ్రీ పరీక్ష రాయడానికి హిజాబ్ ధరించి వచ్చారు. హిజాబ్ ధరించిన యువతులను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ ధరించి వస్తే పరీక్షకు వచ్చిందెవరో గుర్తు పట్టలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంటర్ లోకి వెళ్లాలంటే హిజాబ్ తీసేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బందికి , విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు అరగంట తర్వాత చివరకు విద్యార్థునులు హిజాబ్ తీసేకి పరీక్ష హాల్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని విద్యార్థినులు హోం మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లగా పై విధంగా స్పందించారు.
