- కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నడు: పీసీసీ చీఫ్ మహేశ్
- తెలంగాణలో బీజేపీకి చాన్స్ లేదు..
- ప్రజామోదంతోనే రెండేండ్ల పండుగ చేస్తున్నం
- కేసీఆర్ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీమ్‌లు తెచ్చేవాళ్లమని వెల్లడి
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మెట్రో లైన్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ ఫోర్త్ సిటీ నిర్మాణానికి ఫండ్స్ రాకుండా కిషన్‌రెడ్డి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ నగరానికి వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ, ధ్యాసలేదని, అందుకే ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జూబ్లిహిల్స్ బైపోల్‌లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి చాన్స్ లేదని, జూబ్లీహిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెండేండ్ల ప్రజా పాలనతో ఖుషీగా ఉన్నామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్‌తో ప్రజలు క్లారిటీ ఇచ్చారని మహేశ్‌గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్‌కు అప్పగించి తమపై విశ్వాసాన్ని, బాధ్యతను పెంచారని అన్నారు. ఆ స్ఫూర్తితో రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమిట్‌తో ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మరోసారి ఆకర్షిస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రతి నెలా భరిస్తూ కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కేసీఆర్ చేసిన ఆ అప్పులేకుంటే మరిన్ని స్కీమ్స్ అమలు చేసేవాళ్లమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో 80 శాతం ఇప్పటికే అమలు చేశామని, వచ్చే మూడేండ్లలో మిగితా వాటిని నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్లి.. మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మహేశ్‌గౌడ్.. పద్మశాలీ సంఘం వసతి గృహాల కొత్త కమిటీ ప్రమాణ స్వీకరణ ప్రొగ్రామ్‌కు హాజరయ్యారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఉన్నారు.
