- దక్షిణాదికి బీజేపీ మోడల్‌తోనే అత్యధిక సీట్లు: మహేశ్వర్ రెడ్డి
- కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం వెళ్తే సౌత్‌కు అన్యాయమే
- జీఎస్‌డీపీ అంటే ‘గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్’ అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రాజ్యాంగంపై అవగాహన లేదని, కేవలం గాంధీ కుటుంబం దగ్గర మార్కులు కొట్టేయడానికే జగన్నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఏలేటి మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పడం బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రియంబుల్‌లోనే ‘మాకు మేమే ఇచ్చుకుంటున్నాం’ అని ఉందని గుర్తుచేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదని, డీలిమిటేషన్ అనేది ఆర్టికల్ 82, 170 ప్రకారం జరిగే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం దక్షిణాదికి 129 సీట్లు ఉన్నాయని, బీజేపీ ప్రతిపాదించిన 53 శాతం సీట్ల పెంపు ఫార్ములా ప్రకారం ఇవి 198కి పెరుగుతాయని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ చెప్పినట్టు కేవలం జనాభా ప్రాతిపదికన వెళ్తే కేవలం 171 సీట్లు మాత్రమే వస్తాయని వివరించారు. అంటే, కాంగ్రెస్ మోడల్ వల్ల దక్షిణాదికి 39 సీట్ల నష్టం జరుగుతుందన్నారు. వాస్తవం ఇలా ఉంటే.. బీజేపీపై బురద జల్లడం సరికాదన్నారు.
పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర
రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రీడ్ పాలసీ లేదా జీఎస్‌డీపీ (గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్) అనేది పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పన్నులు కట్టే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది రేవంత్ కొత్త వాదన అన్నారు. ఇదే పద్ధతిని రాష్ట్రంలో అమలు చేస్తే.. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాల్లో సీట్లు తగ్గించి, కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏరియాలకే సీట్లు పెంచుతారా? అని ప్రశ్నించారు. తన సీటు కాపాడుకోవడానికి ఆయన ఆర్టీజీఎస్ (రేవంత్ టు గాంధీ సెటిల్మెంట్) రాజకీయం చేస్తున్నారన్నారు.
మల్లికార్జున్ ఖర్గే సీటుపై కన్నేసి, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే ఈ లేఖల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశంపై ఏ వేదిక మీదైనా, ఏ డేటాతోనైనా ఓపెన్ డిబేట్‌కు తాము సిద్ధమని, సీఎం రేవంత్ సిద్ధమా? అంటూ ఏలేటి బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసే ఈ చారిత్రక బిల్లుకు మద్దతు తెలపాలని హితవు పలికారు.

