ఆర్టీసీ బస్సులకు మెయింటనెన్స్ కష్టాలు

ఆర్టీసీ బస్సులకు మెయింటనెన్స్ కష్టాలు

వరంగల్‍ రూరల్‍, వెలుగుకరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో నెల రోజులుగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలు, గ్యారేజ్‍లకే పరిమితం అయ్యాయి. నాలుగు నెలల క్రితం ఆర్టీసీ సమ్మె కారణంగా దాదాపు 53 రోజుల పాటు బస్సులు పెద్ద సంఖ్యలో డిపోలకే  పరిమితం కాగా,  ఇప్పుడు కరోనా కారణంగా బస్సులు బయటకురావడంలేదు. ప్రజారవాణా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో  డ్రైవర్లు, కండక్టర్లు ఇండ్లలోనే ఉంటున్నారు. ఎక్కువ రోజులు బస్సులను నడపకపోతే వాటి పనితీరుపై ఎఫెక్ట్​ పడే ప్రమాదముంది. ముఖ్యంగా రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‍, వెన్నెల వంటి ఏసీ బస్సుల్లోని బ్యాటరీలు, ఇతర పార్ట్స్​దెబ్బతినే చాన్స్​ ఉండడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

వరంగల్‍ రీజియన్‍లో..

రాష్ట్రవ్యాప్తంగా 9 రీజియన్లు, 97 డిపోల పరిధిలోని10 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‍  రీజియన్‍  పరిధిలో హన్మకొండ, వరంగల్ 1, వరంగల్ 2, జనగామ, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లితో కలిపి 9 డిపోలు ఉన్నాయి. ఇందులో 754 ఆర్టీసీ బస్సులు, 230 అద్దె బస్సులున్నాయి. మొత్తంగా 4,200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నిత్యం  సుమారు 10 లక్షల మంది ప్రయాణికులను వారివారి గమ్యాలకు చేరుస్తున్నాయి.

డెయిలీ.. కండిషన్‍ చూడాలే

వరంగల్ రీజియన్ పరిధిలోని డిపోల్లో 480 మంది మెకానిక్‍లు ఉన్నారు. నార్మల్​గా అయితే రెగ్యులర్‍ ప్రివెంటివ్ చెకప్స్ ఉంటాయి. బస్సులు రిపేర్​కు రాకముందే దానిని గుర్తించి సరిచేయడాన్ని ప్రివెంటివ్ చెకప్స్ అంటారు. దీనిలో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4.. నాలుగు దశల్లో బస్సుల కండిషన్‍ చెక్ చేస్తారు. షెడ్యూల్–1లో.. డ్రైవర్ ఇచ్చిన కంప్లైంట్స్ తో పాటు క్లచ్, బ్రేక్, ఆయిలింగ్ సాధారణ చెకప్ ఉంటుంది. ఆర్టీసీలో ప్రతి బస్సుకు ఇది రోజూ జరిగే ప్రక్రియ. షెడ్యూల్–2లో గ్రీజింగ్, లూబ్రికేటింగ్ ఉంటుంది. ఇది వారానికి ఒకసారి చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్–3 విషయానికొస్తే.. ప్రతి 12–15 వేల కిలోమీటర్లకు ఒకసారి చేస్తారు. ఈ ప్రక్రియలో షెడ్యూల్ –1, షెడ్యూల్ –2 చూస్తూ.. ఇంజన్ ను పూర్తిస్థాయిలో చెకప్ చేసి లోపాలుంటే సరిచేయాలి. షెడ్యూల్–4లో..  అబ్బుల్లో గ్రీజింగ్..  క్లచ్‍, బ్రేక్ వైర్ల మార్పు, ఇతారత్రా ఏమైనా లోపాలుంటే సరిచేస్తారు.

ఆర్టీసీకి..కోట్ల రూపాయలు లాస్‍

ఆర్టీసీ సమ్మె కాలంలో దాదాపు 53 రోజులు బస్సులు రోడ్డెక్కలేదు. తాత్కాలిక సిబ్బందితో పనిచేసినా  సంస్థ కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది.  మేడారం జాతర రావడం  కొంత రిలీఫ్‍ ఇచ్చింది. కాగా, వరంగల్‍ రీజియన్‍ పరిధిలోనే  సంస్థకు రోజుకు రూ.1.30 కోట్ల ఆదాయం వచ్చేది. కరోనా ఎఫెక్టు కారణంగా నెల రోజులుగా పైసా ఇన్‍కమ్‍  లేదు. ఈ ఒక్క రీజియన్‍ నుంచే  ఆర్టీసీకీ ఏం తక్కువ  రూ. 40 కోట్లు నుంచి 45 కోట్ల ఆదాయం రాలేదు. మరికొన్ని రోజులు లాక్‍డౌన్‍ కంటిన్యూ కానుంది. ఇవన్నీ ఆర్టీసీ డెవలప్‍మెంట్‍పై ఎఫెక్ట్​ చూపే చాన్స్​ కనిపిస్తోంది.

ఉద్యోగుల్లో సాలరీల టెన్షన్‍

కరోనా ఎఫెక్ట్​తో   ఆర్టీసీ ఉద్యోగుల్లో టెన్షన్‍ నెలకొంది. సమ్మె కాలంలో దాదాపు రెండు నెలలు సిబ్బంది ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. చివర్లో  సర్కారు, యూనియన్లు  దిగిరావడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో వారిలో మరోసారి ఆందోళన మొదలైంది. లాక్‍డౌన్‍ ముందు వరకు చేసిన డ్యూటీలకు సంబంధించి 50 శాతం మాత్రమే సాలరీలు వేశారు. కొన్ని విభాగాలు తప్పించి.. మార్చిలో దాదాపు అందరూ డ్రైవర్లు, కండక్టర్లు ఇండ్లలోనే ఉన్నారు. ఈ క్రమంలో జీతభత్యాల విషయంలో సర్కారు ఎలా స్పందిస్తుందోననే టెన్షన్‍ వారిలో నెలకొంది.